రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కాకినాడ క్రైం: స్థానికంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడికి చెందిన మోకా గౌతమ్ (18) స్థానిక చికెన్ షాప్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం అతని పుట్టిన రోజు సందర్భంగా తన స్నేహితులను ఇంటికి పిలిచి భోజనాలు పెట్టాడు. అర్ధరాత్రి వరకూ సందడిగా గడిపి అందరూ వెళ్లిపోగా, ఉండూరుకు చెందిన ఏలేటి కార్తీక్ (20), యానాం సమీపంలో ఇంజరానికి చెందిన మేడిశెట్టి మణి వెంకటసాయి (25)లు గౌతమ్‌తోనే ఉన్నారు. నిద్రపోకుండా ఈ ముగ్గురు అర్ధరాత్రి దాటే వరకూ మేడపై మాట్లాడుకుంటూ కాలక్షేపం చేశారు. సోమవారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో ఈ ముగ్గురు స్కూటీపై మెయిన్ రోడ్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఉదయం డ్యూటీ నిమిత్తం కాకినాడ జగన్నాథపురానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ షేక్ అహ్మద్ రాజా తన బుల్లెట్‌పై జగన్నాథపురం నుంచి వస్తున్నారు. మెయిన్ రోడ్‌లో కేఎఫ్‌సీ స్టోర్ వద్దకు వచ్చేసరికి ఈ రెండు వాహనాలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు యువకులతో పాటు కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. మోకా గౌతమ్ అక్కడిక్కడే చనిపోగా, మేడిశెట్టి సాయి ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నెత్తురోడుతున్న ఏలేటి కార్తీక్‌ను అక్కడి వారు కాకినాడ జీజీహెచ్‌కు, కానిస్టేబుల్ రాజాను కుటుంబ సభ్యులు అక్కడికి సమీపాన ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, ప్రమాదానికి కారణాలను పరిశీలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. స్కూటీపై వచ్చిన ముగ్గురు యువకులు మద్యం తాగి, ట్రిపుల్ రైడింగ్‌లో అతి వేగంగా వచ్చారని కానిస్టేబుల్ రాజా కుటుంబీకులు ఆరోపిస్తుంటే, కానిస్టేబుల్ రోడ్ లైన్‌ను క్రాస్ చేసి రహదారి మధ్యలో వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని బాధితుల కుటుంబీకులు అంటున్నారు. ట్రిపుల్ రైడింగ్ నిజమేనని, మద్యం తాగి ఉన్నారా లేదా అనేది పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడి కావాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. మృతులు అవివాహితులని పేర్కొన్నారు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ బుజ్జి బాబు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి


