దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

Feb 13 2026 3:14 AM | Updated on Feb 13 2026 3:14 AM

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన

హామీలు అమలు చేయాలి

వైఎస్సార్‌ సీపీ దివ్యాంగుల విభాగం

రాష్ట్ర అధ్యక్షుడు దుర్గారెడ్డి డిమాండ్‌

రాజమహేంద్రవరం రూరల్‌: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అయినా దివ్యాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని వైఎస్సార్‌ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి అన్నారు. గురువారం బొమ్మూరు లోని పార్టీ కార్యాలయంలో జిల్లా దివ్యాంగుల సెల్‌ అధ్యక్షుడు ముత్యాల పోసికుమార్‌ అధ్యక్షతన జిల్లా దివ్యాంగుల సెల్‌ సంస్థాగత కమిటీ నిర్మాణ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దుర్గారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిది లక్షల పెన్షన్లు ఉండగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్షకు పైగా పెన్షన్‌లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో దివ్యాంగులు ఆందోళన నిర్వహించిన తర్వాత వెరిఫికేషన్‌ పేరుతో కూటమి కార్యకర్తలకు, ఆ పార్టీలో పనిచేసే సానుభూతిపరులకు దివ్యాంగుల పెన్షన్లు తిరిగి మంజూరు చేశారన్నారు. వైఎస్సార్‌ సీపీ సానుభూతి పరులకు, కార్యకర్తలకు పెన్షన్లు తొలగించారని తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దివ్యాంగులకు పెన్షన్‌లను ప్రతినెలా ఒకటో తేదీన ఇంటికి వచ్చి ఇచ్చేవారని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పారు. 2016 దివ్యాంగుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజున చంద్రబాబు ఇంద్రధనస్సు పేరుతో ఏడువరాలు ప్రకటించి ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న దివ్యాంగులకు బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర దివ్యాంగుల సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆవుల నాగేంద్ర మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి, సమస్యలను గాలికొదిలేసిందన్నారు. ఉమ్మడి చిత్తూరి జిల్లా దివ్యాంగుల సెల్‌ అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్‌ మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష హోదాలేనప్పటికీ నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉన్నారన్నారు. 2029లో జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చేవరకు దివ్యాంగులంతా చంద్రబాబు సర్కార్‌ వైఫల్యాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశానికి అధ్యక్షత వహించిన పోసికుమార్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. అర్హులైన దివ్యాంగులకు ఇవ్వవలసిన పెన్షన్‌ను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు కొంతమంది డాక్టర్లు దివ్యాంగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అలాంటి వారిపై 2016 చట్టం 92 ఏ సెక్షన్‌ ప్రకారం కేసులు కట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ మోహన్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు కోలాటి నాగరాజు, రాజమహేంద్రవరం అర్బన్‌ అధ్యక్షుడు మహేష్‌, దివ్యాంగుల హక్కుల వేదిక గౌరవాధ్యక్షుడు ముద్దాల అను, దివ్యాంగుల మహిళా నాయకురాలు సానబోయిన దుర్గ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement