ఎన్నికలవరం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలవరం

Feb 12 2026 7:28 AM | Updated on Feb 12 2026 7:28 AM

ఎన్ని

ఎన్నికలవరం

పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామం

సాక్షి, రాజమహేంద్రవరం: స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు, కూటమి నేతల్లో అంతర్మథనం మొదలైందా?, ఒక వైపు ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన చేసినా.. నిర్వహణపై మల్లగుల్లాలు పడుతున్నారా?, ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న తరుణంలో ఎన్నికల్లో ఓటమి తథ్యమన్న సంకేతాలతో స్థానిక సమరానికి వెనకడుగు వేస్తున్నారా?, ప్రత్యేకాధికారుల పాలనకే మొగ్గు చూపుతున్నారా?.. ఈ ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వస్తోంది.

ఇదీ సంగతి

స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది మార్చి 17వ తేదీతో మున్సిపాలిటీలు, ఏప్రిల్‌ 2వ తేదీ నాటికి గ్రామ పంచాయతీల పాలక వర్గాల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రస్తావన తెరపైకి వచ్చింది. ఈ మేరకు నూతన ఓటర్ల జాబితాను రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆయా శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 9వ తేదీ నాటికి ఓటర్ల ఫొటోలతో సహా తుది జాబితాను ప్రకటించాలని పేర్కొంది. 2026 జనవరి ఒకటి అర్హత తేదీగా చేసి, ఓటర్ల జాబితాను నవీకరించాలని ఆదేశించింది.

ఓటర్ల జాబితా రూపకల్పనకు శ్రీకారం

స్థానిక ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మార్చి 9వ తేదీ నాటికి ఓటర్ల జాబితా ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌ ఈ నెల 6వ తేదీన ఉత్తర్వులు వెలువరించింది. 2026 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేలా కొత్త ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సూచించింది. కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్ల జాబితా నవీకరణకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారుగా 18.46 లక్షల మంది ఓటర్లున్నారు. నూతన ఓటర్ల చేర్పులతో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఎన్నికలు ఇలా..

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఒక్కటే ఉంది. దీనిలో గ్రామాల విలీనం అంశం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. మిగిలిన మండపేట, కొవ్వూరు, నిడదవోలు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయి. వీటితో పాటు 343 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంపై రాజకీయ నేతల్లో మీమాంస నెలకొంది. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి ప్రారంభమవుతోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ పార్టీ 90 శాతానికి పైగా సీట్లు దక్కించుకుంది. ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠాన్ని సైతం కై వసం చేసుకుంది. కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపల్‌ చైర్మన్లు దక్కించుకుంది. వచ్చే ఎన్నికల్లో సైతం సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.

వార్డుల రిజర్వేషన్లపై ఉత్కంఠ

స్థానిక ఎన్నికల దృష్ట్యా మార్చి 9వ తేదీ నాటికి ఓటర్ల జాబితాను ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చింది. గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు ఓటర్ల జాబితా తయారీలో తలమునకలవుతున్నారు. గతేడాది సెప్టెంబర్‌ 3న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తాత్కాలికంగా షెడ్యూల్‌ ప్రకటించినా, మళ్లీ వాయిదా వేసింది. మార్చి 9వ తేదీ నాటికి ఓటర్ల జాబితాను ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌ తాజాగా ఆదేశాలు ఇవ్వడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. జిల్లాలో ఎన్ని పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత వార్డుల రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీ సర్పంచ్‌, మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఈ పరిణామం ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. పంచాయతీ సర్పంచ్‌, మున్సిపల్‌ చైర్మన్ల పదవులు తాము దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది.

అనేక ఆరోపణలు

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూటమి నేతలు అక్రమార్కుల అవతారం ఎత్తారు. మద్యం, ఇసుక ఇలా ఏ రంగమైనా సంపాదనే ధ్యేయంగా అడ్డగోలు వ్యవహారానికి నాంది పలికారు. రూ.కోట్ల అక్రమ సంపాదనను తమ జేబుల్లో వేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు నేతలు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం, ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులకు దిగడం, కేసులు బనాయించడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగితే పరాజయం పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో ఎన్నికల కమిషన్‌ తన వంతుగా కసరత్తు చేస్తున్నా.. ప్రభుత్వ సన్నద్ధతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతలు, ప్రభుత్వం ఎన్నికలపై మొగ్గుచూపడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వైఎస్సార్‌ సీపీలో ఉత్సాహం

చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్‌ సీపీ పోరాటం విస్తృతం చేస్తోంది. రైతులు, విద్యార్థులు, యువతకు అండగా నిలుస్తోంది. ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తోంది. వైఎస్సార్‌ సీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ పరిణామం ప్రజల్లో సానుకూల ఫలితాలు తెచ్చింది. వైఎస్సార్‌ సీపీకి ప్రజా ఆదరణ పెరిగింది. దీంతో స్థానిక ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధిస్తామనే ధీమా నెలకొంది.

రిజర్వేషన్లపై చర్చలు

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో గ్రామాలు, పట్టణాల్లో ఆశావహుల సందడి మొదలైంది. ఏ నలుగురు కలిసినా వార్డు రిజర్వేషన్లు, పదవుల రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల ఖరారు విషయంలో ప్రభుత్వం నుంచి ఇంత వరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో ఎన్నికలు జరుగుతాయా, లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. మరో వైపు నిర్ణీత గడువులోగా ఎన్నికల ప్రక్రియ ముందుకు కదలకపోతే, ఆయా మున్సిపాలిటీలు, పంచాయతీల్లో చైర్మన్లు, సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన వెంటనే స్పెషల్‌ ప్రత్యేకాధికారులను నియమించేందుకు సైతం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

ఫ స్థానిక సంస్థల ఎన్నికలకు

ఎన్నికల కమిషన్‌ సన్నద్ధం

ఫ మున్సిపల్‌, పంచాయతీ పాలకవర్గాలకు నిర్వహించేందుకు కసరత్తు

ఫ మార్చి 9వ తేదీన ఓటర్ల జాబితా

ప్రచురించాలని ఆదేశాలు

ఫ ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికార యంత్రాంగం

ఫ ఎన్నికల నిర్వహణకు చంద్రబాబు ప్రభుత్వం వెనకడుగు

ఫ ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో

మొగ్గుచూపని సర్కారు

జిల్లా స్వరూపం

రెవెన్యూ డివిజన్లు : 2

జనాభా (2011 లెక్కల ప్రకారం) :

18.32 లక్షలు

ఓటర్లు : 18.46 లక్షలు

మండలాలు : 22

కార్పొరేషన్‌ : 1

మున్సిపాలిటీలు : 3

మున్సిపల్‌ వార్డులు : 149

పంచాయతీలు : 343

ఎన్నికలవరం1
1/1

ఎన్నికలవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement