ఇక అధోతరగతి!
● టెన్త్ పరీక్షలపై ప్రైవేట్ టీచర్ల పెత్తనం
● 30 శాతం మందిని ఇన్విజిలేటర్లుగా
నియమించేందుకు కసరత్తు
● సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టిన
చంద్రబాబు ప్రభుత్వం
● వివరాల సేకరణలో విద్యాశాఖ
అధికారులు
● ఈ విధానంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రభుత్వంలో ప్రైవేటు పెత్తనానికి చంద్రబాబు ప్రభుత్వం ద్వారాలు తెరుస్తోందా? ఇందులో భాగంగానే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటుకు కట్టబెట్టేందుకు పావులు కదిపిందా? తాజాగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల పర్యవేక్షణ బాధ్యతలు ప్రైవేటు ఉపాధ్యాయులకు అప్పజెప్పేందుకు రంగం సిద్ధం చేస్తోందా? ఏయే పాఠశాలల్లో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారో గణాంకాలు సేకరించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలివ్వడం ఇందుకు బలం చేకూరుస్తోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది విద్యావేత్తల నుంచి.
ఇదేం విప్లవాత్మకం?
విద్యాశాఖలో విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం గందరగోళ విధానాలకు తెర తీస్తోంది. విద్యాశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో పర్యవేక్షణ (ఇన్విజిలేటర్లు) బాధ్యతలను ప్రైవేటు ఉపాధ్యాయులకు అప్పగించే విధానానికి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్న తరుణంలో పదో తరగతి పరీక్షల విధానంలో తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇలాంటి సమయంలో వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటన్న ప్రశ్న వెల్లువెత్తుతోంది. ప్రైవేటు పాఠశాలలకు లబ్ధి చేకూర్చేందుకేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే అమలైతే పరీక్షల్లో పారదర్శకత కొరవడుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల యాజమాన్యాలు పరస్పరం సహకరించుకునే అవకాశం ఉంటుందన్న విమర్శలు వినవస్తున్నాయి.
ఎస్‌జీటీలకు పూర్తిగా మినహాయింపు
పది పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఇప్పటి వరకు అత్యధిక శాతం సెకండరీ గ్రేడ్ టీచర్లను (ఎస్‌జీటీ) నియమించడం పరిపాటిగా వస్తోంది. మార్చిలో జరిగే పరీక్షల్లో వారిని పూర్తి స్థాయిలో దూరంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులను సైతం పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యం చేయాలని యోచిస్తోంది. ఇప్పటి వరకు పరీక్షల నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బంది నియామకాలకు అమలు చేస్తున్న మాన్యువల్ విధానానికి మంగళం పాడేదిశగా రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఏడీఓలు, ఇన్విజిలేటర్లను డిజిటల్ విధానంలో ఆటోమేషన్ పద్ధతిలో నియమించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏఏ పాఠశాలల్లో ఎంతమంది పనిచేస్తున్నారు..? అనే విషయమై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
30 శాతం ప్రైవేటు టీచర్ల భాగస్వామ్యం
పదో తరగతి పరీక్షలకు అవసరమైన ఇన్విజిలేటర్లలో కనీసం 30 శాతం మందిని నియమించనున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు ఇప్పటికే ప్రకటించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి పబ్లిక్ పరీక్షల్లోనూ ప్రభుత్వ పాఠశాలల టీచర్లనే నియమిస్తున్నారు. పరీక్షలు జరిగినన్ని రోజులు ముఖ్యంగా హైస్కూలు, సమీప ప్రాథమిక పాఠశాలల్లో కేవలం కొద్దిమంది మాత్రమే టీచర్లు ఉంటున్నారు. దీంతో పాఠశాలల్లో తరగతుల నిర్వహణ కష్టంగా మారుతోందన్న కారణంతో ప్రైవేట్ టీచర్లను ఇన్విజిలేటర్లుగా నియమిస్తున్నట్లు విద్యాశాఖ చెబుతున్నా.. ఈ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డిజిటల్ నియామకాలు
పది పరీక్షల నిర్వహణకు అవసరమైన అధికారులు, ఇన్విజిలేటర్లను నియమించేందుకు తొలిసారిగా డిజిటల్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. పాఠశాల హెచ్‌ఎంలు, అన్ని కేడర్ల ఉపాధ్యాయుల వివరాలు ఉపాధ్యాయులు సమాచార వ్యవస్థ టిస్‌లో డిజిటల్ రూపంలో లీప్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటి ఆధారంగా ఆటోమేషన్ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన డీఓలు, ఏడీఓలు, ఇన్విజిలేటర్లను నియమిం చనున్నారు. వీరు పనిచేసే పాఠశాలలకు 10 కిలోమీటర్ల లోపు దూరం ఉన్న పరీక్షా కేంద్రాల్లో నియమించేలా సాఫ్ట్‌వేర్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇన్విజిలేటర్ల నియామకంలో 60 సంవత్సరాలు పైబడిన వారు, దివ్యాంగులు, బాలింతలు, గర్భిణులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని పరీక్షల విధుల నుంచి మినహాయించనున్నట్లు తెలిసింది. లీప్‌యాప్‌లో ఇందుకోసం ఆప్షన్ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా పరీక్షల విధులకు నియమితులైనవారు తప్పనిసరిగా డ్యూటీకి హాజరు కావాల్సి ఉంటుంది. హాజరు కాని వారిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేసే అవకాశముంటుంది
ఇన్విజిలేటర్లుగా
స్కూలు అసిస్టెంట్లు
పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్లుగా స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, క్రాఫ్ట్, డ్రాయింగ్, సంగీతం, ఇతర సబ్జెక్టులు బోధించని వారిని మాత్రమే నియమించనున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిషు, సంస్కృతం పరీక్షలకు.. గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ టీచర్లను నియమించనున్నారు. గ్రూపు సబ్జెక్టులు గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలకు తెలుగు, హిందీ, ఇంగ్లిషు టీచర్లను నియమించనున్నారు. వీరు మొత్తంగా మూడు లేదా నాలుగు రోజులు మాత్రమే పరీక్షల విధులు నిర్వహించనున్నారు.
జిల్లాలో ఇలా
పదో తరగతి విద్యను బోధిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు జిల్లాలో 204 ఉండగా 12,977 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లాలో సుమారు 4,500 మంది ఉపాధ్యాయులు ఉండగా.. పది పబ్లిక్ పరీక్షల పర్యవేక్షణకు సుమారు 1,500 మంది అవసరం ఉంది. ఇందులో 30 శాతం ప్రైవేటు ఉపాధ్యాయులు ఉండనున్నారు.
పారదర్శకతపై అనుమానాలు
ప్రైవేటు ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్ బాధ్యతలు అప్పగిస్తే పరీక్షల్లో పారదర్శకత లోపిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు టీచర్లు ఆయా పాఠశాలల యాజమాన్యాలతో కుమ్మకై ్క కాపీయింగ్‌కు పాల్పడే విద్యార్థులను చూసీచూడనట్లు వదిలేసే పరిస్థితి తలెత్తుతుందన్న భావన కలుగుతోంది. దీంతో కష్టపడి చదివిన విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. .


