ఉపాధి.. హతవిధీ! | - | Sakshi
Sakshi News home page

ఉపాధి.. హతవిధీ!

Feb 4 2026 7:19 AM | Updated on Feb 4 2026 7:19 AM

ఉపాధి

ఉపాధి.. హతవిధీ!

సాక్షి, రాజమహేంద్రవరం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో శ్రామికులకు పస్తులు తప్పడం లేదు. రోజంతా స్వేదం చిందించినా గొంతులోకి ముద్ద దిగడం లేదు. ఉపాధి హామీ కూలీలకు సుమారు పది నెలలుగా వేతనాలు స్తంభించడంతో లబోదిబోమంటున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. ఉపాధి కూలి డబ్బు ఎప్పుడు చెల్లిస్తారా..? అని నిరీక్షిస్తున్నారు. మెటీరియల్‌ కాంపొనెంట్‌ బకాయిలు సైతం విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు.

రూ.33 కోట్ల బకాయిలు

వలసలు నియంత్రించి ఉన్న ఊళ్లోనే పని కల్పించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యసాధనకు దూరంగా ఉంటోంది. సకాలంలో వేతనాలు మంజూరు చేయకపోవడంతో కూలీలు పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ 20 నుంచి 30 వేల మంది వరకు ఉపాధి పనులకు హాజరవుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.37 కోట్ల విలువైన వివిధ రకాల పనులు చేపట్టారు. కేవలం రూ.3.84 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. రూ.33.20 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో కూలీకి సగటున రూ.25 వేలకు పైగా వేతనం అందాల్సి ఉంది. ఉపాధి కూలీ డబ్బు వస్తుందని కిరాణా దుకాణాల్లో అప్పులు చేశారు. వాటిని తీర్చుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇదేమని అధికారులను ప్రశ్నిస్తే త్వరలోనే విడుదలవుతాయని చెబుతున్నారే తప్ప.. ఎప్పుడన్నది కచ్చితంగా చెప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు.

రోజుకు సగటున రూ.274 కూలి

ఉపాధి పథకంలో వ్యక్తి రోజంతా కష్టపడి పనిచేస్తే సగటున రోజుకు రూ.274 వరకు కూలి గిట్టుబాటు అవుతుంది. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించుకోవాలి. సాధారణంగా ఉపాధి పథకంలో ప్రతి వారం కూలి డబ్బు చెల్లించేవారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూలీలకు చెల్లింపు ప్రక్రియ గందరగోళంగా మారింది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం లేకపోవడంతో బిల్లుల చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రతి వారం కూలి డబ్బు చెల్లిస్తే ఇంట్లో అవసరాలకు సరకులు కొనుగోలు చేసుకుంటారు. జూన్‌ మాసం నుంచి ఉపాధి వేతనాల చెల్లింపులు ఆగిపోయాయి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా పనులకు వెళుతున్నా.. ఒక్క రూపాయి కూడా తమ ఖాతాల్లో జమ కావడం లేదని కూలీలు వాపోతున్నారు. వెరసి ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. నెలల తరబడి డబ్బు ఇవ్వకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

విడుదలకాని మెటీరియల్‌ కాంపొనెంట్‌ బకాయిలు

ఉపాధి హామీ పనుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టు పనులు హడావుడిగా చేపట్టారు. మినీ గోకులం, మొక్కల పెంపకం తదితర పనులు చేపట్టారు. ఇందుకుగాను ఇప్పటి వరకు రూ.కోట్లలో వెచ్చించారు. పెండింగ్‌ బిల్లుల్లో రూ.5 కోట్లకుపైగా మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. అప్పులు చేసి మరీ పనులు చేపట్టామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గగ్గోలు పెడుతున్నారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకురావడం లేదు. ప్రధానంగా రహదారుల పనుల్లో ఎక్కువ శాతం బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేందుకు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు వేసేశారు. ప్రస్తుతం బిల్లులు అందక ఆవేదన చెందుతున్నారు.

జిల్లాలో ఇలా...

జిల్లా వ్యాప్తంగా 1.45 లక్షల జాబ్‌కార్డులు మంజూరు చేశారు. అందులో 2.20 లక్షల మంది కూలీలు నమోదయ్యారు. 1.74 లక్షల మంది పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 864 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. మహిళలకు 55.04 శాతం, ఎస్టీలకు 2.03 శాతం, ఎస్సీలకు 36.57 శాతం పనులు చూపారు. ఇప్పటి వరకు 5,271 పనులు పూర్తి చేశారు. అందులో 43.44 శాతం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యం కల్పించారు.

30 లక్షల పనిదినాలు లక్ష్యం

జిల్లా వ్యాప్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో 30 లక్షల పనిదినాలు కల్పించాలని డ్వామా అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. బిల్లులు సకాంలో చెల్లించకపోవడంతో పనులకు వచ్చేందుకు కూలీలు ఆసక్తి చూపడం లేదు.

గందరగోళంగా వీబీజీ రామ్‌జీ

ఉపాధి పథకంలో కేంద్రం సమూల మార్పులు తీసుకువచ్చింది. మహాత్మాగాంధీ పేరును తొలగించి ‘వీబీజీ రామ్‌జీ’ అనే పేరు పెట్టింది. నిబంధనలను సైతం మార్పు చేసింది. పథకం అమలు, పనుల కేటాయింపుపై నేటికీ అధికారులకు మార్గదర్శకాలు అందకపోవడంతో పనుల కేటాయింపుపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఏ పనులు కల్పించాలన్న విషయమై అధికారుల్లో మీమాంస నెలకొంది. ఇదిలా ఉంటే.. కొత్త నిబంధనల మేరకు పంచాయత్‌రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో కొన్ని పనులు కల్పిస్తారంటూ ప్రచారం జరుగుతోంది.

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు అందని వేతనాలు

పది నెలలుగా తప్పని పస్తులు

జిల్లావ్యాప్తంగా

పేరుకుపోయిన బకాయిలు

స్వేదం చిందిస్తున్నా

కడుపు నిండని దుస్థితి

ఎప్పుడు అందుతాయో

తెలియక ఆందోళన

నేటికీ అందని

‘జీ–రామ్‌జీ’ మార్గదర్శకాలు

125 రోజుల

పనుల కల్పనపై స్పష్టత కరవు

జిల్లాలో ఉపాధి పథకం బ్లాకులు : 18

పంచాయతీలు : 300

మంజూరైన జాబ్‌కార్డులు : 1.45 లక్షలు

కూలీలు : 2.20 లక్షల మంది

యాక్టివ్‌ జాబ్‌కార్డులు : 1.19 లక్షలు

పనులు వినియోగించుకుంటున్న

కూలీలు : 1.74 లక్షల మంది

ఉపాధి.. హతవిధీ!1
1/1

ఉపాధి.. హతవిధీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement