జోగి రమేష్‌కు తానేటి వనిత పరామర్శ
దేవరపల్లి: టీడీపీ రౌడీ మూకల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్ గృహాన్ని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు తానేటి వనిత పరిశీలించారు. మంగళవారం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్‌ను కలిసి ఆమె పరామర్శించారు. జరిగిన ఘటనకు సంబంఽధించిన వీడియో చిత్రాలను జోగి రమేష్ వనితకు చూపించారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అమలు జరగడంలేదని, నారా లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని టీడీపీ రౌడీ మూకలు దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నాయని ఆమె అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. జోగి రమేష్ ఇంటిపై దాడులు చేసిన టీడీపీ రౌడీ మూకలపై తక్షణం చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్, కుటుంబ సభ్యులను తానేటి వనిత పరామర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని దాడులు చేసినా, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడేది లేదని ఆమె పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు ధైర్యంతో ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సాలి వేణు, వైఎస్సార్ సీపీ నల్లజర్ల మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాకారపు బంగారమ్మ, పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కుసులూరి వెంకట సతీష్, యర్నగూడెం సర్పంచ్ బొంతా భరత్‌బాబు జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.


