ఆగిన మీటర్‌ రీడింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఆగిన మీటర్‌ రీడింగ్‌

Feb 3 2026 7:34 AM | Updated on Feb 3 2026 7:34 AM

ఆగిన

ఆగిన మీటర్‌ రీడింగ్‌

రెండు రోజులుగా నిలిపివేసిన

విద్యుత్‌ మీటర్‌ రీడర్లు

ఒకటో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లినట్లు ప్రకటన

జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి

సకాలంలో బిల్లులు తీయకపోవడంతో వినియోగదారుల ఆందోళన

స్లాబ్‌ రేట్‌ పెరిగి బిల్లు అధికంగా వచ్చే అవకాశం ఉందన్న భావన

‘తూర్పు’లో 200 మందికి పైగా మీటర్‌ రీడర్లు

సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రంగంలో సంక్షోభం నెలకొంటోంది. సాఫీగా సాగే వ్యవస్థలను సైతం గందరగోళంలోకి నెట్టేస్తోంది. ఇప్పటికే అనేక వ్యవస్థల నిర్వీర్యానికి ఆజ్యం పోసిన సర్కారు తాజాగా స్పాట్‌ బిల్లింగ్‌పై పడింది. విద్యుత్‌ మీటర్‌ రీడర్ల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపకపోవడంతో మీటర్‌ రీడర్లు సమ్మెబాట పట్టారు. రెండు రోజులుగా విద్యుత్‌ మీటర్ల నుంచి బిల్లులు తీసే ప్రక్రియ ఆగిపోయింది. ఈ పరిణామం విద్యుత్‌ వినియోగదారుల్లో ఆందోళన నింపుతోంది. బిల్లులు తీయడం ఆలస్యమైతే.. విద్యుత్‌ వినియోగంలో స్లాబ్‌ పెరిగిపోయి బిల్లులు అధికంగా వచ్చే అవకాశం ఉందని వాపోతున్నారు. ఇప్పటికే పెరిగిన కరెంట్‌ బిల్లులతో ఆర్థికంగా అతలాకుతలం అవుతుంటే.. మరింతగా బిల్లులు పెరిగితే ఎలాగన్న ప్రశ్న తలెత్తుతోంది.

జిల్లాలో ఇలా..

జిల్లా వ్యాప్తంగా 7,82,170 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ సంస్థలవి 10,607, ప్రైవేటు కనెక్షన్లు 7,71,563 ఉన్నాయి. ప్రతి నెలా సుమారు 108.85 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తున్నారు. ఇందుకుగాను ప్రతి నెలా సుమారు రూ.74.41 కోట్ల బిల్లులు ప్రభుత్వానికి, విద్యుత్‌ శాఖకు చెల్లిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 200 మందికి పైగా మీటర్‌ రీడర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 11వ తేదీ లోపు మీటర్‌ రీడింగ్‌ తీస్తారు. ఒక మీటర్‌కు రీడింగ్‌ తీసినందుకు గాను విద్యుత్‌ శాఖ సంబంధిత కాంట్రాక్టర్‌ పట్టణ ప్రాంతాల్లో రూ.6.16, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6.36 చొప్పున చెల్లిస్తారు. ఈ మొత్తం సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు డిమాండ్‌ చేయడంతో పట్టణాల్లో రూ.0.26 పైసలు, గ్రామాల్లో రూ.0.75 పెంచారు. రీడింగ్‌ యంత్రం చార్జీలు, ఫోన్‌ రీచార్జ్‌, రీడింగ్‌ పేపర్‌ రోల్‌, మరమ్మతులు, ఈఎస్‌ఈ, ఈపీఎఫ్‌ మినహాయింపులు పోగా.. విద్యుత్‌ మీటర్‌ రీడర్‌కు చేతికి ఒక్కో మీటర్‌కు రూ.3.10 మాత్రమే అందుతుంది. సగటున ఒక్క మీటర్‌ రీడర్‌ నెలకు మూడు వేల మీటర్ల వరకు రీడింగ్‌ తీస్తారు. దీన్ని బట్టి చూస్తే వారి ఆదాయం ప్రతి నెలా కేవలం రూ.10 వేల లోపే ఉంటుంది. ప్రాంతాన్ని, పట్టణాన్ని బట్టి రీడింగ్‌ సామర్థ్యం మారుతుంది. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుతో సంస్థలో ఏళ్లుగా పనిచేస్తున్న కొందరు సిబ్బందికి ఉపాధి దక్కదు. విద్యుత్‌ సంస్థనే నమ్ముకుని పనిచేస్తున్న మీటర్‌ రీడర్ల ఉపాధికి గండిపడుతుంది. వినియోగదారులకు విద్యుత్‌ రీచార్జ్‌పై అవగాహన లేకపోతే ఇబ్బందులు తప్పవు. విద్యుత్‌ చౌర్యం పెరిగే అవకాశం ఉంది. విద్యుత్‌ లైన్ల నుంచి విద్యుత్‌ అక్రమంగా వినియోగించుకునే వారి సంఖ్య పెరగనుంది.

పొట్టకూటి కోసం పోరుబాట

చాలీచాలని వేతనాలతో బతుకుబండి లాగుతున్న విద్యుత్‌ మీటర్‌ రీడర్లకు కూటమి ప్రభుత్వం షాక్‌ ఇవ్వడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోవడంతో ఉద్యమ బాట పట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సర్వీసులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ గతంలో చలో విజయవాడ నిర్వహించారు. విజయవాడ ధర్నా చౌక్‌లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలంటూ గళమెత్తారు. 20 ఏళ్లుగా విద్యుత్‌ శాఖలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలంటూ నినదించారు.

అప్పుడు వ్యతిరేకించి.. ఇప్పుడు సమర్థించి..

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకించిన సీఎం చంద్రబాబునాయుడు ప్రస్తుతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై వినియోగదారులు, ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యవసాయ బోరు బావుల వద్ద స్మార్ట్‌ మీటర్లు పెడితే పగలగొట్టండని పిలుపునిచ్చిన చంద్రబాబు, నారా లోకేష్‌ ప్రస్తుతం వ్యవసాయ కనెక్షన్లకు అమర్చేందుకు సన్నాహాలు ప్రారంభించడంపై రైతుల్లో అగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విమర్శించిన నోటితోనే స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయడం మంచి ప్రక్రియ అని చెబుతుండటాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరించడం తగదని హితవు పలుకుతున్నారు.

ప్రధాన డిమాండ్లు

ఫ స్మార్ట్‌ మీటర్లు తీసుకువచ్చిన తరుణంలో మీటర్‌ రీడర్లకు విద్యుత్‌ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి.

ఫ కనీస వేతనాలు అమలు చేయాలి.

ఫ రీడర్ల విద్యార్హతను బట్టి విద్యుత్‌ శాఖలో టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ షిఫ్ట్‌ ఆపరేటర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, మిగిలిన వారిని వాచ్‌మెన్‌, అటెండర్‌ పోస్టుల్లో నియమించాలి.

ఫ ఎస్‌క్రో ఖాతాను వెంటనే తెరవాలి.

ఫ కాంట్రాక్టర్లు, విద్యుత్‌ శాఖ అధికారులతో విద్యుత్‌ మీటర్‌ రీడర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి.

జగన్‌ హయాంలో సానుకూలం

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయనున్న సమయంలో మీటర్‌ రీడర్లు ఆందోళన చెందారు. దీంతో స్పందించిన అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ మీటర్‌ రీడర్లకు ప్రత్యామ్నాయం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. విద్యుత్‌ శాఖలోనే ఉపాధి కల్పిస్తామని భరోసా కల్పించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం మానేసింది.

పట్టించుకోని ప్రభుత్వం

తమ డిమాండ్లు పరిష్కరించాలని, స్మార్ట్‌ మీటర్ల తీసుకొస్తే తాము జీవనోపాధి కోల్పోతామని, తమకు ప్రత్యామ్నాయం కల్పించాలని కోరుతూ మంత్రులు, అధికారులను కలిసి మీటర్‌ రీడర్లు పరిస్థితి విన్నవించారు. ప్రత్యామ్నాయం చూపుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంతో ఒకటో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లారు.

సోమవారం చర్చలకు రావాలని తెలపడంతో మీటర్‌ రీడర్ల సంఘం నేతలు విజయవాడ వెళ్లారు. ప్రభుత్వంతో చర్చలు ఫలించిన దాఖలాలు లేవు. దీంతో రీడర్లు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సమ్మెలోకి వెళుతున్నారు.

ఆగిన మీటర్‌ రీడింగ్‌ 1
1/1

ఆగిన మీటర్‌ రీడింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement