కుట్ర రాజకీయాలపై ఆగ్రహం
● చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ నేతల వ్యవహార శైలిపై నిరసనలు
● అంబటి అరెస్టుకు నిరసనగా
అంబేద్కర్ విగ్రహం వద్ద
● జక్కంపూడి గణేష్ బైఠాయింపు
● తిరుమల లడ్డూ విషయంలో
తప్పుడు ప్రచారంపై
● పోలీసులకు ఫిర్యాదు చేసిన తలారి
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం, టీడీపీ నేతలు చేస్తున్న కుట్ర రాజకీయాలపై వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. రెండు రోజులుగా వివిధ పద్ధతుల్లో ఆందోళనలు చేపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ కుట్ర, కక్ష సాధింపు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంబటి అరెస్టుకు నిరసన
మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుకు నిరసనగా వైఎస్సార్ సీపీ యువనేత జక్కంపూడి గణేష్ ఆందోళన చేపట్టారు. సెంట్రల్ జైల్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. దీంతో పోలీసులు, వైఎస్సార్ సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుకు ఇప్పటికై నా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు.
దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు
తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని టీడీపీ, కూటమి నేతలు నిరాధార ఆరోపణ చేస్తున్నారు. ఇదే విషయంపై నియోజకవర్గ కేంద్రాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ దుష్ప్రచారానికి ఒడిగట్టారని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎండగట్టాలని, నియోజకవర్గ కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేయాలని వైఎస్సార్ సీపీ కేంద్రం కార్యాలయం పిలుపు ఇచ్చింది. అందులో భాగంగా తలారి వెంకట్రావు కొవ్వూరు మెయిన్ సెంటర్లో లడ్డూ వివాదంపై టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫ్లెక్లీ తీయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీడీపీ నేతలు వ్యవహరించడం దారుణమన్నారు. రాజకీయాలకు వేంకటేశ్వరస్వామిని వాడుకోవడం దిక్కుమాలిన చర్యగా అభివర్ణించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రమేష్, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కుట్ర రాజకీయాలపై ఆగ్రహం


