పెద్దపులి జాడ కోసం అన్వేషణ
తొర్రేడు–వెంకటనగరం గ్రామాల మధ్యే
సంచరిస్తున్న వైనం
రాజమహేంద్రవరం రూరల్: తొర్రేడు గ్రామంలో పెద్దపులి రెండో రోజులుగా జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తొర్రేడు శివారులోని మొక్కజొన్న తోట ప్రాంతంలో మాటు వేసిన పెద్దపులి అక్కడ నుంచి వెంకటనగరం గ్రామంలోని మొక్కజొన్న తోటల్లో నుంచి వెళ్లినట్లు కాలిముద్రలను బట్టి అటవీశాఖ అధికారులు సోమవారం గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకరరావు నేతృత్వంలో అటవీరేంజ్ ఆఫీసర్ దావీదు రాజు, సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉదయం నుంచి తొర్రేడు, వెంకటనగరం గ్రామాలలో పులిజాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తొర్రేడు మొక్కజొన్న తోటలో ఉన్న పెద్దపులి వెంకటనగరం గ్రామం వైపు వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పడంతో అధికారులు ఆ దిశగా వెళ్లి పులి అడుగుజాడలు గుర్తించారు. అక్కడి నుంచి మొక్కజొన్న తోటలు ఉండడంతో పులి అడుగుజాడలు కనిపించలేదు. పులి వచ్చిన మార్గానే వెనక్కి వెళ్లిపోయిందా అనే కోణంలోను అధికారులు అన్వేషిస్తున్నారు. కొంతమంది సీతానగరం మండలం కూనవరం, ముగ్గళ్లలో పెద్దపులి సంచరించిందని తెలపడంతో అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతాలకు వెళ్లి పరిశీలించినప్పటికీ ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. తొర్రేడు గ్రామంలో బోను, ట్రాప్ కెమెరాలను అమర్చారు. పెద్దపులి సంచారంతో తొర్రేడు, వెంకటనగరం గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :
జిల్లా అటవీశాఖ అధికారి
తొర్రేడు, వెంకటనగరంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకరరావు తెలిపారు. రాత్రి వేళ ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పెద్దపులి సమీపంలో టైగర్ రిజర్‌వ్స్ నుంచి వచ్చి ఉంటుందన్నారు. తల్లి నుంచి విడిపోయే సమయంలో పులులు కొత్త ప్రాంతాలను వెతుక్కుంటాయన్నారు.
దానిలో భాగంగా గత నెల 20న ఏలూరు జిల్లాలో ప్రవేశించిందన్నారు. గత నెల 30వ తేదీన గోదావరి నది దాటుకుని చినకొండేపూడి, పెదకొండేపూడి ప్రాంతాల్లో తిరిగిందని చెప్పారు. అక్కడ నుంచి తొర్రేడు గ్రామం చేరుకుని రెండు ఆవులు, ఒక దూడపై దాడి చేయడంతో మృతిచెందాయని తెలిపారు. ఒక దూడను తిన్నటు చెప్పారు. ఆదివారం రాత్రి ఆవులను చంపలేదన్నారు. పులి సాధారణంగా రాత్రి సమయాల్లో ప్రయాణిస్తుందని, మనిషి పులికి ఆహారం కాదని, అది నాలుగు కాళ్ల జంతువులపై దృష్టి పెడుతుందన్నారు. పులిని సురక్షితంగా బంధించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.


