దిగుబడి ఆశలు గల్లంతు
● ఆకులు రాలిపోతున్న
వర్జీనియా పొగాకు తోటలు
● క్యూరింగ్ దశలో దెబ్బతిన్న వైనం
● తీవ్రంగా నష్టపోయామంటున్న రైతులు
దేవరపల్లి: వర్జీనియా పొగాకు తోటలు ఆశాజనకంగా ఉండడంతో నాణ్యమైన దిగుబడులు వస్తాయని ఆశతో ఉన్న రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. గోపాలపురం, దేవరపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వర్జీనియా పొగాకు తోటల్లో ఆకులు రాలిపోయి మొక్కలు నల్లబడి ఎండిపోతున్నాయి. ఆకు ముట్టుకుంటే రాలిపోతోంది. గోపాలపురం మండలం వాదాలకుంట, వెదుళ్లకుంట, గోపాలపురం, దేవరపల్లి మండలంలో బందపురం, చిన్నాయగూడెం, సంగాయగూడెం ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. రెలుపులు, క్యూరింగ్‌లు జరుగుతున్న తరుణంలో తోటలు ఎండిపోతున్నాయి. రైతులకు ఎకరం కౌలుకు రూ.80 వేలు, పెట్టుబడి రూ.2.20 లక్షలు అయింది. పిలక నివారణకు గోపాలపురంలోని ఓ పురుగు మందుల దుకాణం నుంచి మందు తెచ్చి వాడామని, అనంతరం తోటలు దెబ్బతిన్నట్టు కొందరు రైతులు చెబుతున్నారు. 20 సంవత్సరాలుగా ఇదే మందు వాడుతున్నామని, ఎప్పుడూ ఈ విధంగా జరగలేదని రైతులు వివరించారు. సీటీఆర్‌ఐ సిఫారసు చేసిన చక్కర స్టాప్ మందులో దుకాణం నుంచి తీసుకు వచ్చిన మందు కలిపి పిచికారీ చేశారు. దుకాణం నుంచి 5 లీటర్లు, లీటర్ల టిన్నులు తీసుకు వచ్చి తోటలకు వాడగా 5 లీటర్ల డబ్బాలోని మందు వాడిన తోటలు దెబ్బతిన్నాయి. లీటరు డబ్బాల్లోని మందు వాడిన తోటలు దెబ్బతినలేదు. రెండు గ్రామాల్లో సుమారు 30 మంది రైతులు ఈ విధంగా మందులు వాడి దెబ్బతిన్నారు.
దిగుబడులపై ప్రభావం
ఆకులు పండిపోయి రాలిపోవడం వల్ల ఆకులు గుల్లబారి లో గ్రేడు శాతం ఎక్కువగా ఉంటుంది. మొక్కకు 22 నుంచి 24 వరకు ఉన్న ఆకులు రాలిపోయి తోటలు మోడుబారిపోతున్నాయి. దీనివల్ల ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి తగ్గుతుంది.
సిఫారసు చేసిన
మందులే వాడాలి
సీటీఆర్‌ఐ, ఐటీసీ, పొగాకు బోర్డు అధికారులు సిఫారసు చేసిన మందులను మాత్రమే వాడాలి. పిలక నివారణకు చక్కర స్టాంప్ మందును ఈ ఏడాది సిఫారసు చేశాం. దీనిని మాత్రమే రైతులు వాడాలి. ఇతర మందులు వాడితే తోటలు దెబ్బతింటాయని ముందు నుంచి రైతులకు సూచిస్తున్నాం. పొగాకు తోటలకు కలుపు నివారణ మందు వాడరాదు. సొంత ప్రయోగాలు చేస్తే రైతులు నష్టపోతారు.
– జీఎల్‌కే ప్రసాద్, టుబాకో బోర్డు
రీజనల్ మేనేజరు, రాజమహేంద్రవరం
10 ఎకరాల్లో మొక్కలు దెబ్బతిన్నాయి
నేను 50 ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నాను. 10 ఎకరాల్లో పిలక నివారణ మందు వాడగా పంట దెబ్బతింది. ఎకరాకు రూ.3 లక్షలు ఖర్చు అయింది. వ్యవసాయాఽధికారి దృష్టికి తీసుకు వెళ్లాం. గ్రామంలో 30 మంది రైతులు నష్టపోయారు.
– గద్దే ఈశ్వరుడు, రైతు, వాదాలకుంట, గోపాలపురం మండలం
కోలుకోలేని దెబ్బ
ఈ ఏడాది పొగాకు రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. రూ.కోట్లలో నష్టం జరిగింది. 10 ఎకరాల్లో మొక్కలు ఆకులు రాలి ఎండిపోయాయి. రాలిపోయిన ఆకులు క్యూరింగ్‌కు పనికిరావు. వ్యవసాయాధికారులకు చెప్పినా న్యాయం జరగలేదు.
– కాకర్ల సతీష్, రైతు, వెదుళ్లకుంట, గోపాలపురం మండలం
దిగుబడి ఆశలు గల్లంతు


