సత్యదేవుడు.. భక్తవరదుడు
● ఘనంగా ముగిసిన కోటి తులసి పత్రి పూజ
● రత్నగిరిపై పది రోజుల పాటు నిర్వహణ
అన్నవరం: భక్తవరదుడు.. కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడు సత్యదేవుడు. లోక కల్యాణార్థం ఆ స్వామివారికి పవిత్ర మాఘ మాసంలో కోటి తులసి పత్రి పూజ అట్టహాసంగా జరిగింది. సత్యదేవుని వార్షిక కల్యాణ మండపంలో పది రోజులుగా జరుగుతున్న ఈ క్రతువు మహా శివరాత్రి పర్వదినాన ఆదివారం ఉదయం రుద్రహోమం పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. కోటి తులసి దళాలతో సత్యదేవుడు, అమ్మవార్లకు 66 మంది రుత్విక్కులు, వేద పండితులు, అర్చక స్వాములు పది రోజుల పాటు పూజలు చేశారు. చివరి రోజు ఉదయం ఎనిమిది గంటలకు వార్షిక కల్యాణ మండపం వద్ద రుద్ర హోమం ఘనంగా జరిపారు. ఉదయం 11 గంటలకు జరిగిన పూర్ణాహుతిలో హోమ ద్రవ్యాలను వేదపండితుల మంత్రోఛ్చాటన మధ్య రుత్విక్కులు సమర్పించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వేండ్ర త్రినాథరావు, డీసీ బాబూరావు, అసిస్టెంట్ కమిషనర్ మంజులా దేవి దంపతులు పాల్గొన్నారు. హోమం అనంతరం పవిత్ర జలాలను సత్యదేవుని ఆలయంతో పాటు ప్రాంగణంలో అర్చక స్వాములు చల్లారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కోటి తులసి పూజ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేద పండితులు గొల్లపల్లి ఘనాపాఠి గంగాధరబట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, చిట్టి శివ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు కంచిభట్ల సాయిరామ్, దత్తాత్రేయ శర్మ, పరిచారకులు శివ, కొండవీటి రాజా, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, వ్రత పురోహిత సంఘం మాజీ అధ్యక్షులు నాగాభట్ల రవిశర్మ, కర్రి సత్యనారాయణ మూర్తి (నాని), పురోహితులు పాలంకి పట్టాభి, చల్లపిళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వైదిక బృందానికి అభినందన
పది రోజులుగా కోటి తులసి పూజను ఘనంగా నిర్వహించిన వేదపండితులు, అర్చకులు, వ్రత పురోహితులను దేవస్థానం చైర్మన్, ఈఓ అభినందిస్తూ ఉత్తమ సేవా పత్రాలను అందజేశారు. తులసి గొప్పదనంపై పది రోజుల పాటు ప్రవచనాలు సాగించిన సామవేద పండితుడు సూర్యనారాయణను ఈఓ సత్కరించారు. అదే విధంగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన ఏఈఓలు డీవీఎస్ కృష్ణారావు, అనకాపల్లి ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గణపతిని అభినందించారు. కాగా, వార్షిక కల్యాణ మండపంలో సత్యదేవుని నమూనా విగ్రహాల వద్ద ప్రత్యేక ఆకర్షణగా ఉంచిన తులసి మొక్కలను పూజ అనంతరం భక్తులకు చైర్మన్, ఈఓ పంపిణీ చేశారు.
త్వరలోనే మరో ఆధ్యాత్మిక కార్యక్రమం
రత్నగిరిపై మాఘ మాసంలో నిర్వహించిన కోటి తులసి పూజకు భక్తుల నుంచి విశేష స్పందన లభించిందని అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు అన్నారు. తక్కువ సమయంలోనే ఈ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. రూ.12 లక్షల బడ్జెట్‌గా నిర్ణయించామన్నారు. అయితే దాతల నుంచి రూ.15 లక్షలు విరాళాలు వచ్చాయన్నారు. ఇందులో 135 మంది ఒక రోజు పూజకు రూ.1,500 చెల్లించిన దాతలు ఉన్నారన్నారు. రుత్విక్కులకు రూ.3.65 లక్షలు సంభావనగా అందజేశామని తెలిపారు. త్వరలోనే మరో ఆధ్యాత్మిక, పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
సత్యదేవుడు.. భక్తవరదుడు
సత్యదేవుడు.. భక్తవరదుడు


