ఘనంగా శూలాల సంబరం
అమలాపురం రూరల్: ఇమ్మిడివరప్పాడులో కరికాల భక్తుల ఆధ్వర్యంలో వీరభద్రస్వామి ఆలయం వద్ద శూలాల సంబరం ఆదివారం వైభవంగా జరిగింది. యువకులు ఉపవాస దీక్షతో బుగ్గలు, కంఠానికి శూలాలు గుచ్చుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. శూలధారులను ట్రాక్టరుపై ఉంచి బాజాభజంత్రీలతో గ్రామోత్సవం నిర్వహించారు.
నేటి నుంచి సహకార సమ్మె
అమలాపురం టౌన్: జిల్లా సహకార ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మె బాట పడుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని 18 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఫలితం లేక పోరాటానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విధిలేక ఈనెల 16 నుంచి సమ్మెకు దిగుతున్నామని జిల్లా సహకార ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యర్రంశెట్టి రామచంద్రరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫలితంగా జిల్లా సహకార సేవలు సోమవారం నుంచి తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 298 వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘాలకు చెందిన సీఈఓలు, ఇతర ఉద్యోగులు, సిబ్బంది సమ్మెలో పాల్గోనున్నారు. కోనసీమ జిల్లాలోని 166 సంఘాలు సోమవారం నుంచి మూత పడనున్నాయి. జీఓ నంబరు 36 ప్రకారం సహకార ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నది ప్రధాన డిమాండ్. 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ విరమణ 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని ఇలా పలు డిమాండ్లతో సమ్మెకు దిగుతున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర సహకార ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తోట వెంకట్రామయ్య, రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యనారాయణ, జిల్లా కోశాధికారి బొబ్బా సుబ్రహ్మణ్య చౌదరి, ఉపాధ్యక్షుడు మేడిచర్ల రామలింగేశ్వరరావు, ఉప ప్రధాన కార్యదర్శులు కుంపట్ల అయ్యప్పనాయుడు, మట్టపర్తి జయరామ్‌లు సమ్మెకు నాయకత్వం వహిస్తున్నారు.
యువతి ఆత్మహత్యాయత్నం
మామిడికుదురు: మాకనపాలెం గ్రామానికి చెందిన 29 ఏళ్ల యువతి (అవివాహిత) ఆదివారం వైనతేయ వారధిపై నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. మహా శివరాత్రి సందర్భంగా గోదావరి నదిలో స్నానానికి వచ్చిన భక్తులు యువతి గోదావరిలో దూకడాన్ని గమనించారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో ఆమెను బోటులో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆమె గత కొన్ని రోజుల నుంచి మానసిక సమస్యతో బాధపడుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ యువతిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించి, తర్వాత ఇంటికి తీసుకు వచ్చారు. యువతికి ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
గుండెపోటుతో మహిళ మృతి
సీతానగరం: దైవ దర్శనానికి వెళ్తూ ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందింది. సీతానగరం మండలం ఇనుగంటవారిపేటకు చెందిన నల్లా బేబి (56) పట్టిసీమ వీరభద్రుని దర్శనానికి బయలు దేరింది. వంగలపూడి రేవు నుంచి ట్రాక్టర్‌పై గోదావరి పాయ వరకూ వెళ్లి, తర్వాత నడక మార్గంలో వెళ్లిన అనంతరం పట్టిసీమ ఆలయానికి ట్రాక్టర్ ఎక్కింది. కొద్ది దూరం వెళ్లిన అనంతరం గుండెనొప్పి వస్తుందని తన కుమారుడు శివకు ఫోన్ చేసింది. ఫోన్ పెట్టిన అనంతరం ట్రాక్టర్‌లోని కూర్చుని ఉన్న బేబి కుప్పకూలిపోయింది. అదే ట్రాక్టర్‌పై సీతానగరం బస్టాండ్ సెంటర్‌లోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త నాగేశ్వరరావు, కుమారుడు శివ, వివాహమైన కుమార్తె ఉన్నారు.


