లాభాలతో మురవంగ | - | Sakshi
Sakshi News home page

లాభాలతో మురవంగ

Feb 16 2026 7:31 AM | Updated on Feb 16 2026 7:31 AM

లాభాల

లాభాలతో మురవంగ

ఏడాది పొడవునా పంట

వేసవి సాగుకు ఇదే అదును

సమగ్ర సస్యరక్షణ ఇలా..

● పురుగు ఆశించిన కాయలు, కొమ్మలను తుంచి నాశనం చేయాలి.

● ఈ పంటలో అంతర పంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి వేసుకోవచ్చు.

● లింగాకర్షణ బుట్టలను ఎకరాకు 4 చొప్పున ఏర్పాటు చేయాలి.

● అల్లిక రెక్కల పురుగులను మొక్కకు రెండు చొప్పున పంట పెరిగే దశలో విడుదల చేయాలి.

● ట్రైకోగ్రామా బదనికలను ఎకరానికి 20 వేల చొప్పున విడుదల చేయాలి.

● బీటీ మందులను లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున పూత దశలో పిచికారీ చేయాలి.

● పంట పూత దశలో, కాయ దశలో 2, 4–డి మందును 10 మిల్లీగ్రాములు ఒక లీటరు నీటికి లేదా నాఫ్తాలిన్‌ అసిటికామ్లం ఒక మిల్లీలీటరు 5 లీటర్ల నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేస్తే 15 నుంచి 20 శాతం అధికోత్పత్తి పొందవచ్చు.

పెరవలి: వంగ తోటలతో లాభాల బాట పట్టవచ్చు.. కూరగాయల్లో అతి ప్రధానమైన ఈ పంటను ఏడాది పొడవునా పండించవచ్చు. సమయం, వాతావరణ పరిస్థితులను బట్టి సాగు చేస్తే మంచి దిగుబడులతో పాటు అధిక ఆదాయం పొందవచ్చు. తూర్పుగోదావరి జిల్లాలో కూరగాయల పంటలు 2,554 హెక్టార్లలో సాగు చేస్తుండగా, ఇందులో వంగ 900 హెక్టార్లలో ఉంది. ఈ పంట సాగుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు, ఎరువుల యాజమాన్యం, తెగుళ్ల నివారణ చర్యల గురించి కొవ్వూరు వ్యవసాయ సహాయ సంచాలకుడు (ఏడీఏ) సీహెచ్‌ శ్రీనివాస్‌ పలు సూచనలు చేశారు. ఆ వివరాలు ఇలా..

నారు.. ఆపై విత్తు

● వంగ పంటను ఏడాదిలో మూడు దఫాలు వేయవచ్చు. వర్షాకాలం పంటను జూన్‌ – జూలైలో, శీతాకాల పంటను అక్టోబర్‌ – నవంబర్‌లో, వేసవి పంటను జనవరి – ఫిబ్రవరి నెలల్లో నారు కోసం విత్తుకోవచ్చు.

● వంగ పంట సాగు చేసే రైతులు 30 నుంచి 35 రోజుల వయసు కలిగిన నారును మాత్రమే నాటుకోవాలి. వర్షాకాలం పంట జూలై – ఆగస్టులో, శీతాకాల పంట నవంబర్‌ – డిసెంబర్‌లో, వేసవి పంట ఫిబ్రవరి–మార్చి నెలల్లో నాటవచ్చు.

విత్తన రకాలు

ఎకరాకు సూటి రకాలు 250 గ్రాములు, సంకరజాతి రకాలు 150 గ్రాముల విత్తనం కావాలి. స్థానిక మార్కెట్లలో వినియోగదారుల అభిరుచిని బట్టి రకాలను ఎంపిక చేసుకోవచ్చు. జిల్లాలో ఎక్కువగా భాగ్యమతి, పూసాపర్పుల్‌ లాంగ్‌, పూసాపర్పుల్‌ క్లస్టర్‌, పూసా క్రాంతి, గులాబీ రకాలను వినియోగిస్తారు. అక్కడక్కడా చారల వంగను కూడా సాగు చేస్తారు. ఈ పంట రకాన్ని బట్టి 130 నుంచి 150 రోజులకు చేతికి వస్తుంది.

నారుమడి పెంపకం

వంగ పంట సాగు చేసే ముందు నారుమడి పెంపకానికి జాగ్రత్తలు తీసుకోవాలి. 6 అంగుళాల ఎత్తు, ఒక మీటరు వెడల్పు, 4 మీటర్ల పొడవు కలిగిన నారుమడులను ఎకరానికి 10 నుంచి 12 మడులను తయారు చేయాలి. 250 గ్రాముల విత్తనాన్ని ఈ మడులపై విత్తుకోవాలి. విత్తనాలను విత్తే ముందు 50 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన నీటిలో విత్తనాలను 30 నిమిషాల పాటు నానబెట్టి నీడలో ఆరనివ్వాలి. ఆ తరువాత కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరామ్‌ లేదా ఇండోఫిల్‌ అనే మందుతో విత్తనశుద్ధి చేయాలి. ఆ తరువాత ట్రైకోడెర్మావిరిడి కల్చర్‌ను ఒక గ్రాము విత్తనాలకు పట్టించి విత్తుకోవాలి. ఈ మడుల్లో నీరు నిల్వ లేకుండా చూడటంతో పాటు రోజూ మడులను తడపాలి. నీరు నిల్వ ఉండి మడులు మునిగిపోతే మాగుడు తెగులు ఆశిస్తుంది. దీని నివారణకు ఆక్సీక్లోరైడ్‌ మందును లీటరు నీటికి మూడు గ్రాముల చొప్పున కలిపి వారం వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేయాలి.

ఎరువుల యాజమాన్యం

ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును పంట వేసే ముందు ఆఖరి దుక్కులో వేయాలి. 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్‌ దుక్కులో వేయాలి. నారు వేసిన తరువాత ఎరువులను 30వ రోజు, 60వ రోజు, 75వ రోజుతో పాటు 40 కిలోల నత్రజనిని మూడు సమ భాగాలుగా చేసి వీటిని అందించాలి.

నీటి యాజమాన్యం

వంగ మొక్కలను నాటిన వెంటనే నీరు పెట్టాలి. వర్షాకాలంలో అవసరాన్ని బట్టి, శీతాకాలంలో 7 రోజులకు, వేసవిలో 3 నుంచి 5 రోజులకు ఒకసారి నీరు అందించాలి. వేసవి పంటలో నీటితడులు కాయలు కోయడానికి రెండు రోజుల ముందే ఇవ్వాలి. ఇలా ఇవ్వకపోతే వంకాయలు చేదుగా ఉంటాయి.

అన్నవరప్పాడులో వంగ తోట

పురుగులు.. తెగుళ్లు

మొక్కలు నాటిన 30 నుంచి 40 రోజులకు మొవ్వ మరియు కాయతొలుచు పురుగు ఆశించవచ్చు. ఇది ఆశించిన వెంటనే కొమ్మలను తుంచి కార్బరిల్‌ 50 శాతం 3 గ్రాములు లేదా ప్రొఫెనోపాస్‌ రెండు మిల్లీలీటర్లు లేదా సైపర్‌మెత్రిన్‌ ఓ మిల్లీలీటరు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

రసం పీల్చే పురుగుల నివారణకు డైమిథోయేట్‌ లేదా మిథైల్‌డెమెటాన్‌ లేదా పిప్రానిల్‌ లీటరు నీటికి 2 మిల్లీమీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

నారు నాటిన 30 రోజులకు ఆకుమాడు, కాయకుళ్లు తెగులు ఆశిస్తుంది. వీటి నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున పది రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలి.

వెర్రి తెగులు నివారణకు రోగార్‌ లేదా మిథైల్‌ డెమటాన్‌ 2 మిల్లీలీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

ఎండు తెగులు నివారణకు ఎటువంటి చర్యలు లేవు. ఈ తెగులును తట్టుకునే రకాలను ఎంచుకుని సాగు చేయడం ఉత్తమం.

లాభాలతో మురవంగ1
1/2

లాభాలతో మురవంగ

లాభాలతో మురవంగ2
2/2

లాభాలతో మురవంగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement