పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
రాజమహేంద్రవరం రూరల్: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు పిలుపునిచ్చారు. శుక్రవారం కాతేరు గ్రామంలో శ్యామలాంబ గుడి వద్ద నుంచి ‘‘ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం’’ అనే నినాదంతో సామాజిక కార్యకర్త గారపాటి వనజ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నుంచి తిరుమలకు మహిళలు చేపట్టిన పాదయాత్రను ఆయన ప్రారంభించారు. తిరుమలరావు మాట్లాడు తూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సామాజిక కార్యకర్త వనజ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం పేరిట ఎన్నో కార్యక్రమా లు చేస్తున్నారని, అందులో భాగంగానే పాదయాత్రను ప్రారంభించారన్నారు. అనంతరం వనజ మాట్లాడుతూ అన్నదానాలు, వేడుకల్లో స్టీల్ గ్లాస్‌లు, ప్లేట్లు, అరటి ఆకులు, విస్తరాకులు ఉపయోగించి సకల జీవరాశుల ఆరోగ్యాన్ని, భూమాత ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. వాడిన ప్లాస్టిక్‌ను పక్కన పెట్టి పొడి చెత్తగా పారిశుధ్య కార్మికులకు అందజేసి పునరుత్పత్తి వినియోగానికి సహకరించాలన్నారు. పాదయాత్ర పొడవునా ఉన్న గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను వివరిస్తామన్నారు. పాదయాత్రలో గారపాటి వనజ, గారపాటి విజేత, నీరుకొండ అనిత, ముళ్లపూడి శేషకుమారి, ముళ్లపూడి చిట్టి, కాట్రగడ్డ ఉమాదేవి పాల్గొంటున్నారు. ఆ మహిళలను ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. వీరు కాతేరులో ఒక్కో మొక్కను నాటారు. నున్న కృష్ణ, గంగిన హనుమంతరావు, గంగిన జాహ్నవి, మద్దిపట్ల రాజు, మద్దిపట్ల చిన్ని, కాతేరు యూత్ సభ్యులు పాల్గొన్నారు.


