40 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రం
కాకినాడ క్రైం: స్థానిక రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ)లో జీఎన్‌ఎం నర్సింగ్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు విద్యార్థులకు 40 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రం ఇవ్వడం వివాదాస్పదమైంది. పరీక్షకు గంట ముందే హాజరవ్వాలని విద్యార్థులకు సూచనలు అందగా, అందుకు తగ్గట్లుగానే వందలాది మంది విద్యార్థులు ఉదయం 7 గంటల నుంచే జిల్లా నలుమూలల నుంచి కాకినాడకు వచ్చి పరీక్ష కేంద్రం బయటే పడిగాపులు కాశారు. అయితే వారికి ప్రశ్నపత్రం ఇవ్వడం 40 నిమిషాలు ఆలస్యం అయ్యింది. ఆర్‌ఎంసీలో ఎగ్జామినేషన్ హాల్–1, 2, డైనింగ్ హాలు, ఆడిటోరియం ఇలా నాలుగు చోట్ల పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 1,801 మంది హాజరు కానున్నారన్న స్పష్టమైన సమాచారం ఉన్నా పరీక్షలు నిర్వహిస్తున్న జీజీహెచ్ బృందం విద్యార్థులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. కళాశాల ప్రధాన ద్వారం తెరిచింది మొదలు పదుల సంఖ్యలో విద్యార్థులు ఈ హాల్ నుంచి ఆ హాల్‌కి, ఈ సెంటర్ నుంచి ఆ సెంటర్‌కి అంటూ పరుగులు పెడుతూనే ఉన్నారు. తమ సీటు ఏదో తెలియక తీవ్ర గందరగోళానికి గురయ్యారు. కళాశాల ఆవరణలో హాల్ టికెట్ ఆధారంగా పరీక్ష గది ఎక్కడో తెలిపే సూచికలు (సైన్ బోర్డులు) ఏవీలేవు. అలా అని మార్గనిర్దేశం చేసే సహాయకులు కూడా లేరు. ఓ వైపు ఉదయం 9 గంటలు గడుస్తుండగా తీవ్ర ఒత్తిడితో ఎందరో విద్యార్థినులు అటు, ఇటు పరుగులు పెట్టడం కనిపించింది. ఇంతటి గందరగోళానికి తమదే తప్పని గుర్తించిన జీజీహెచ్ పరీక్షల నిర్వహణ బృందం విద్యార్థులందరూ తమ సీట్లలో కూర్చునే వరకు వేచి చూసి 40 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రాన్ని ఇచ్చింది. 12 గంటలకు ముగియాల్సిన పరీక్షను 12.30 వరకూ కొనసాగించారు. కూర్చునే ఏర్పాట్లు, సూచికలు సరిగ్గా లేక పరీక్షకు కొద్ది నిమిషాల ముందు తీవ్ర ఒత్తిడికి గురయ్యామని, సకాలంలో పరీక్ష జరగలేదని, నిర్ణీత వ్యవధిని వినియోగించుకోలేక పోయామని, విలువైన పది నిమిషాల సమయం కోల్పోయామని పరీక్షలు రాసి బయటకు వచ్చిన విద్యార్థులు వాపోయారు. ఈ ఘటనపై రాష్ట్ర డీడీ నర్సింగ్ జ్యోతిని వివరణ కోరగా, బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేసి పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
327 మంది గైర్హాజరు
ఇదిలా ఉంటే జీఎన్‌ఎం మొదటి సంవత్సర పరీక్షలో 1,801 మందికి గాను 1,474 మంది హాజరయ్యారు. 327 మంది గైర్హాజరయ్యారు.
జీఎన్‌ఎం పరీక్షల ఆరంభంలోనే వివాదం


