లెక్క.. పక్కాగా..
రాయవరం: వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన జనాభా లెక్కల సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఈ ప్రక్రియ చేపట్టేందుకు వీలుగా వివిధ స్థాయిల్లో అధికారులను ఇప్పటికే నియమించారు. జనాభా లెక్కల సేకరణ (సెన్సస్) ప్రక్రియ కొన్ని నెలల పాటు జరగనుంది.
ఎందుకంటే..
దేశవ్యాప్తంగా ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడం, కొత్త పథకాల రూపకల్పన వంటి వాటి కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన జనగణన నిర్వహిస్తూంటారు. ఈ ప్రక్రియకు 1872లో నాటి బ్రిటిష్ పాలకుల హయాంలో శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకోసారి దీనిని నిర్వహించేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1951 నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ ఆధ్వర్యాన భారత జనాభా గణాంకాల చట్టం–1948 ప్రకారం జనాభా లెక్కల సేకరణ జరిగేది. చివరిసారి 2011లో జనగణన చేపట్టారు. 2021లో ఈ ప్రక్రియ జరగాల్సి ఉండగా.. ఎన్‌పీఆర్, సీఏఏ వంటి చట్టాలపై ఆందోళనలు, కరోనా మహమ్మారి వ్యాప్తి వంటి పరిస్థితుల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులన్నీ సద్దుమణగడంతో జనాభా లెక్కలను పూర్తి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో జనగణ ప్రక్రియ చేపట్టేందుకు వివిధ స్థాయిల్లో కార్యనిర్వాహక అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నియమించారు.
అధికారుల నియామకం ఇలా..
జిల్లా స్థాయిలో ప్రిన్సిపల్, అడిషనల్ సెన్సస్ అధికారులుగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు వ్యవహరిస్తారు. సబ్ డివిజనల్ సెన్సస్ అధికారిగా సబ్ కలెక్టర్/ఆర్డీవో, చార్జ్ సెన్సస్ అధికారిగా మండల తహసీల్దార్లు, అదనపు చార్జ్ సెన్సస్ అధికారులుగా ఎంపీడీవోలు, అసిస్టెంట్ చార్జ్ సెన్సస్ అధికారులు/సెన్సస్ క్లర్క్ ఇన్‌చార్జి అధికారులుగా డిప్యూటీ తహసీల్దార్/అంతకంటే తక్కువ స్థాయి అధికారి ఉంటారు.
పట్టణ స్థాయిలో..
మున్సిపాలిటీ లేదా నగర పంచాయతీ అధికారులు కూడా చార్జి సెన్సస్ అధికారులుగా వ్యవహరిస్తారు. అదనపు చార్జ్ సెన్సస్ అధికారులుగా టౌన్ ప్లానింగ్ అధికారి/టీపీఎస్/డీఈఈ/ఏఈఈ/మున్సిపల్ రెవెన్యూ అధికారి ఉంటారు. మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ప్రిన్సిపల్ సెన్సస్ అధికారిగా కమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తారు. సిటీ సెన్సస్ అధికారిగా అదనపు కమిషనర్, చార్జి సెన్సస్ అధికారిగా జోనల్/డిప్యూటీ కమిషనర్/అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాధ్యతలు చేపడతారు. టీపీవో/టీపీఎస్/డీఈఈ/ఏఈఈ/ఆర్వో/ఆర్‌ఐ/ఏపీడీలు అదనపు చార్జి సెన్సస్ అధికారిగా వ్యవహరిస్తారు. టీపీవో/టీపీఎస్/డీఈఈ/ఏఈఈ/ఆర్వో/ఆర్‌ఐ సహాయక చార్జి సెన్సస్ అధికారిగా నియమిస్తారు.
ఫ జనగణనకు చురుకుగా ఏర్పాట్లు
ఫ కార్యనిర్వాహక అధికారుల నియామకం
ఫ ప్రిన్సిపల్, అడిషనల్ సెన్సస్ అధికారులుగా కలెక్టర్, జేసీ
ఫ జిల్లా అధికారిగా డీఆర్
ఫ సబ్ డివిజన్ స్థాయిలో ఆర్‌డీఓ
డిజిటల్ విధానంలో..
ఈసారి జనాభా లెక్కల సేకరణను పూర్తి డిజిటల్ విధానంలో, రెండు దశల్లో నిర్వహిస్తారు. తొలి దశలో వచ్చే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య గృహాల జాబితా సేకరిస్తారు. రెండో దశలో జనాభా గణన ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తారు. మొబైల్ యాప్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇది దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ సెన్సస్ కానుంది. ఎన్యూమరేటర్లకు, సూపర్‌వైజర్లకు త్వరలో శిక్షణ ప్రారంభించనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుత జిల్లా జనాభా 20.98 లక్షలు
జిల్లా జనాభా 2011 లెక్కల ప్రకారం 20,98,276. ఇటీవల జిల్లాలో కొత్తగా మండపేట నియోజకవర్గం కలిసిన అనంతరం జిల్లాలో కుటుంబాల సంఖ్య 5,88,452గా ఉంది. మొత్తం జనాభాలో ఎస్సీ, ఎస్టీలు 20 శాతం, ఓసీ, బీసీలు 80 శాతం ఉన్నారు. తాజా జనగణన అనంతరం జిల్లాలో కుటుంబాల సంఖ్యతో పాటు, జనాభా కూడా పెరిగే అవకాశముంది.
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా
మండలం కుటుంబాలు జనాభా
తాళ్లపూడి 15,109 52,785
కొవ్వూరు 30,185 1,08,445
చాగల్లు 18,585 64,774
గోపాలపురం 17,624 62,597
నల్లజర్ల 22,942 80,388
దేవరపల్లి 21,841 77,971
నిడదవోలు 31,631 1,14,245
ఉండ్రాజవరం 20,597 76,489
పెరవలి 19,192 70,194
రాజమహేంద్రవరం రూరల్ 44,692 1,66,973
కడియం 25,160 90,499
రాజమహేంద్రవరం అర్బన్ 91,374 3,41,831
గోకవరం 19,224 69,596
రంగంపేట 16,129 57,106
బిక్కవోలు 20,902 70,277
అనపర్తి 21,002 70,859
సీతానగరం 21,046 71,665
కోరుకొండ 22,672 79,553
రాజానగరం 29,004 1,06,085
మండపేట 38,650 1,32,679
కపిలేశ్వరపురం 19,958 66,809
రాయవరం 20,233 66,456


