కొబ్బరి రైతు వెలవిల | - | Sakshi
Sakshi News home page

కొబ్బరి రైతు వెలవిల

Feb 8 2026 4:27 AM | Updated on Feb 8 2026 4:27 AM

కొబ్బ

కొబ్బరి రైతు వెలవిల

మార్కెట్‌లో పెరిగిన ధర

తోటల్లో తగ్గిన దిగుబడి,

మరోవైపు దళారుల దందా

వెయ్యి కాయలకు రూ.21 వేలన్నా

రైతుకు అందేది రూ.15 వేలే

పెరవలి: సాధారణంగా పంట ఉత్పత్తుల ధర పెరిగితే దాన్ని పండించే రైతులకు లాభాలు వస్తాయి. తద్వారా ఆదాయం పెరిగి కొంత వెనుక వేసుకునే అవకాశం ఉంటుంది. కానీ కొబ్బరి రైతుల పరిస్థితి మరోలా ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో కొబ్బరి కాయలకు గిట్టుబాటు ధర బాగుంది. కానీ దళారులు, వ్యాపారులు కుమ్మక్కవ్వడం, దిగుబడి తగ్గిపోవడంతో వారికి పెరిగిన మేరకు ఆదాయం రావడం లేదు. కొబ్బరి కాయ లకు మార్కెట్‌లో మంచి గిట్టుబాటు ధర ఉన్నా.. దళారులు, వ్యాపారస్తులు కలిసి ధరలను తగ్గించి రైతులకు అందకుండా చేస్తున్నారు.

వెయ్యి కాయలకు..

ప్రస్తుతం మార్కెట్‌లో వెయ్యి కొబ్బరి కాయలు నాణ్యతను బట్టి రూ.19 వేల నుంచి రూ.21 వేలు పలుకుతున్నాయి. అయితే దింపు ఖర్చు, మోత, ఒలుపు, రవాణా అంటూ కొందరు రైతులను దోచుకుంటున్నారు. రైతులు కూడా వచ్చిందే మంచి ధర అని సరిపెట్టుకుంటున్నారు. గత మూడు నెలలుగా అంతంత మాత్రంగా ఉన్న కొబ్బరి ధర నేడు పండగలు సీజన్‌ ప్రారంభం, శుభ ముహూర్తాలు రావడం, దిగుబడి తగ్గడం తదితర కారణాలతో అమాంతం పెరిగింది. అయితే వ్యాపారులు నేరుగా తోట వద్దకే వచ్చి కొబ్బరి దింపు, మోత, రవాణా, ఒలుపు వంటివి అన్ని తామే చూసుకునేలా ఒప్పందం చేసుకుంటున్నారు. దానికి అంగీకరించిన రైతులకు రూ.10 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. అదే రైతు దింపు తీసి ఒక్క చోట గుట్టగా పెట్టితే కాయల నాణ్యతను బట్టి రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకూ చెల్లిస్తున్నారు.

సాగు విస్తీర్ణం

పాత ఉభయ గోదావరి జిల్లాలో సుమారు 70 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు ఉండగా, ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో 8,979 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఇదే కాకుండా చేల గట్లు, పుంత గట్లు, చెరువు గట్లు, లంక భూముల్లో కూడా కొబ్బరి సాగవుతోంది. పెరవలి మండలం కానూరు, కానూరు అగ్రహారం, నడుపల్లి, తీపర్రు, కాకరపర్రు, ముక్కామ ల, ఖండవల్లిల్లో 400 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దళారీలు, వ్యాపారస్తులు కుమ్మక్కవ్వటంతో పెరిగిన ధరను రైతులకు ఇవ్వడం లేదు. ఎక్కడికు వెళ్లినా అదే రేటు చెప్పడంతో రైతులు కూడా చేసేది లేక అయిన కాడికి అమ్ముకుంటున్నారు. .

తగ్గిన దిగుబడులు

గతంలో ఒక ఎకరం కొబ్బరి తోట నుంచి సుమారు 1200 నుంచి 1400 కాయల దిగుబడి వచ్చేది. కానీ నేడు దానిలో దాదాపు సగం తగ్గిపోయి 600 నుంచి 700 కాయలు మాత్రమే వస్తోంది. గతంలో వేసవిలో కాయలు తయారైనా, అవ్వకపోయినా నీళ్లు ఆడేవని దీనితో దిగుబడి వచ్చేదని రైతులు చెబుతున్నారు. నేడు శీతల గాలులు, చలి ఎక్కువగా ఉండటంతో కాయ తయారు కావడం ఆలస్యమవుతోందన్నారు.

ధర పెరగడానికి కారణాలివే..

కొబ్బరికి మార్కెట్‌లో ధర పెరగటానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రంతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో దిగుబడులు అనూహ్యంగా తగ్గిపోవటంతో ఇక్కడి కొబ్బరికి డిమాండ్‌ ఏర్పడింది. అదే సమయంలో పండగలు, శుభ ముహూర్తాలు ఉండటం, దిగుబడి తగ్గటంతో ధరలు పెరిగాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్నాయి. అందుకే మన కొబ్బరికి డిమాండ్‌ వచ్చిందని వ్యాపారస్తులు చెబుతున్నారు.

ఎగుమతులు

మూడు నెలల క్రితం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి నిత్యం 400 నుంచి 500 లారీల్లో ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు జరిగేవి. నాడు 150 లారీలకు మించి వెళ్లడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. కొబ్బరి ధరను పెంచేది, తగ్గించేది ఉమ్మడి జిల్లాలో ప్రధానమైన అంబాజీపేట, పాలకొల్లు మార్కెట్లే. చిరు వ్యాపారస్తులందరూ ఈ మార్కెట్లలో నిర్ణయించిన ధరలు ప్రకారమే రైతులకు చెల్లిస్తారు.

తీపర్రులో కొబ్బరి కాయలను లెక్కిస్తున్న కూలీలు

కలసి రావడం లేదు

కొబ్బరికి మార్కెట్‌లో ధర ఉన్నా మాకు మాత్రం వెయ్యి కాయలకు నాణ్యతను బట్టి రూ.10 వేల నుంచి రూ.12 వేలు చెల్లిస్తున్నారు. ఇదేమిటని అడిగితే ఇష్టం ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు అంటున్నారు. కొబ్బరికి డిమాండ్‌ ఉన్నా మాకు మాత్రం కలసి రావటం లేదు.

– వాకలపూడి గాంధీ, కొబ్బరి రైతు, కానూరు

కొబ్బరి రైతు వెలవిల1
1/1

కొబ్బరి రైతు వెలవిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement