మానవత్వం నశించి పశువుల పాకకు నిప్పు
కపిలేశ్వరపురం: వెదురుమూడి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ దళిత నాయకుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ నక్కా సింహాచలానికి చెందిన పశువుల పాకకు శనివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పాడి ఆవు మృతి చెందగా మరో పాడి గేదె తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతోంది. పశువులతో పాటు పాకలోని దాణా, వ్యవసాయ సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనపై సింహాచలం అంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై జి.హరీష్‌కుమార్, అంగర పశువైద్యాధికారి వీవీ రమణమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేనివారు ఈ అమానుషానికి పాల్పడ్డారని బాధితుడు సింహాచలం అనుమానం వ్యక్తం చేశారు. 2023 జూన్‌లోనూ తన పశువుల పాకకు ఇలాగే నిప్పు పెట్టారని, అప్పటి ఘటన, నేటి ఘటనల్లో రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందన్నారు. గత ఘటన సమయంలో ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేవని సింహాచలం అన్నారు. ఇప్పటికై నా దుండగులను పట్టుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. కాగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జెడ్పీటీసీ సభ్యుడు పుట్టపూడి అబ్బు ఫోన్‌లో సింహాచలాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఘటనా స్థలాన్ని ఎంపీపీ జుత్తుక వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ సాకా శ్రీనివాస్, సర్పంచ్ కురుపూడి ఉదయశ్రీ, వైఎస్సార్ సీపీ నాయకులు సూరిబాబు, నల్ల శ్రీను, అర్జునరావు, పాలింగి శ్రీనివాస్, పాలింగి కిశోర్ పరిశీలించారు.
● పాడి ఆవు మృతి, మరో గేదెకు తీవ్ర గాయాలు
● ఆవేదన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకుడు
మానవత్వం నశించి పశువుల పాకకు నిప్పు


