పుష్కరాలకు ఘాట్ నమూనా సిద్ధం చేయాలి
సీటీఆర్‌ఐ: రానున్న 2027 మహా గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, జిల్లాలోని అన్ని ఘాట్లను ఒకే ఆకృతిలో ఉండేలా ఘాట్ నమూనాను సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి అధికారులను ఆదేశించారు. ఆమె శనివారం ధవళేశ్వరం నుంచి రాజమహేంద్రవరం వరకూ ఉన్న సరస్వతీ ఘాట్, మార్కండేయ ఘాట్, పుష్కర్ ఘాట్ తదితర వాటిని ఎస్పీ డి.నరసింహ కిశోర్, కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనాలతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పుష్కర పుణ్య స్నానాలకు అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించడమే ప్రథమ లక్ష్యమన్నారు. శివరాత్రి సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను పుష్కరాలకు తొలి ట్రైల్ రన్‌గా భావించి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలన్నారు. ముందుగా ఒక మోడల్ ఘాట్‌ను నిర్మించి, అదే డిజైన్‌ను మిగిలిన ఘాట్లకు అనుసరించాలని సూచించారు. నగరపాలకసంస్థ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో మోడల్ ఘాట్ నమూనాను తక్షణమే సిద్ధం చేయాలన్నారు. ఎస్పీ డి.నరసింహ కిశోర్ మాట్లాడుతూ ప్రముఖుల సందర్శన సమయంలోనూ సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక స్నాన ఘట్టాలు ఏర్పాట్లు చేయాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ ఘాట్ల అభివృద్ధిపై ప్రాథమిక కార్యాచరణను వివరించారు.


