ప్రొటోకాల్‌ విస్మరించి అవమానించారు | - | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్‌ విస్మరించి అవమానించారు

Feb 6 2026 7:37 AM | Updated on Feb 6 2026 7:37 AM

ప్రొటోకాల్‌ విస్మరించి అవమానించారు

ప్రొటోకాల్‌ విస్మరించి అవమానించారు

కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తా : మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దుర్గారాణి

కపిలేశ్వరపురం (మండపేట): మండపేట పట్టణంలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవ శిలాఫలకంపై తన పేరుకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రొటోకాల్‌ను విస్మరించారని, తద్వారా తనను అవమానించారంటూ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పతివాడ నూక దుర్గారాణి ఆవేదన వ్యక్తం చేశారు. మండపేటలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ తనకు జరిగిన అవమానాన్ని, స్థానిక పరిస్థితులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. పట్టణంలోని వాటర్‌ వర్క్స్‌ వద్ద నూనతంగా నిర్మించిన 33/11కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ గురువారం రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆవిష్కరించిన శిలాఫలకంలో తన పేరును కింది భాగాన వేశారని, తమ నాయకుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేరును అసలు వేయలేదని చైర్‌పర్స్‌న్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 2007లో బిక్కిన కృష్ణార్జున చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ మున్సిపల్‌ కౌన్సిల్‌లో టీడీపీ ప్రాధాన్యం ఉండటం వల్ల కొన్ని కారణాలు చెప్పి నిర్మాణం అంశాన్ని తిరస్కరించారని గుర్తు చేశారు. ప్రస్తుతం సబ్‌ స్టేషన్‌ నిర్మించటాన్ని స్వాగతిస్తున్నానని, కానీ తనతో సహా మరికొందరి ప్రజాప్రతినిధులను తక్కువ చేసేలా శిలాఫలకాన్ని రూపొందించడం సరికాదన్నారు. సబ్‌ స్టేషన్‌ స్థలం మున్సిపాలిటీ పరిధిలోనిదని, కౌన్సిల్‌లో తీర్మానం చేసి అప్పగించామని, రూ.18 లక్షలు సాధారణ నిధులతో స్థలాన్ని లెవెలింగ్‌ చేసి అప్పగించామన్నారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ తరఫున సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి సహకరించామన్న విషయాన్ని కూడా విస్మరించడం సరికాదన్నారు. టిడ్కో గృహాలు అప్పగింత కార్యక్రమంలో మున్సిపల్‌ శాఖా మంత్రి నారాయణ ఆవిష్కరించిన శిలాఫలకాల్లో కూడా తమ కౌన్సిలర్ల పేర్లు వేయకుండా అవమానించారన్నారు. తమను అవమానించే రీతిలో శిలాఫలకం ప్రొటోకాల్‌కు అనుమతి ఇచ్చిన జిల్లా రెవెన్యూ అధికారిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రొటోకాల్‌ విస్మరణ పట్ల ఎమ్మెల్యే జోగేశ్వరరావు తీరు బాధాకరమని చైర్‌పర్సన్‌ దుర్గారాణి ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement