కార్యదర్శుల శతమతం | - | Sakshi
Sakshi News home page

కార్యదర్శుల శతమతం

Feb 10 2026 7:40 AM | Updated on Feb 10 2026 7:40 AM

కార్యదర్శుల శతమతం

కార్యదర్శుల శతమతం

నెలాఖరుకు 100 శాతం

పన్నుల వసూళ్ల టార్గెట్‌

లేనిపక్షంలో సస్పెండ్‌ చేస్తామంటూ

బెదిరింపులు

ఆందోళనలో గ్రామ పంచాయతీ

కార్యదర్శులు

రాబడే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిళ్లు

జిల్లాలో రూ.133.22 కోట్ల లక్ష్యం

సాక్షి, రాజమహేంద్రవరం: సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం అడ్డదారులు తొక్కిన కూటమి నేతలు అలవిగాని హామీలు ఇచ్చేశారు. తాము గద్దెనెక్కితే సంపద సృష్టిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబునాయుడు అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా సంపదకు బదులు అప్పులు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.3.11 లక్షల కోట్లు అప్పు చేసిందంటే ‘సంపద సృష్టి’ మాటల్లో డొల్లతనం బయట పడుతోంది. ఖజానా ఖాళీ అవడంతో అడ్డదారుల్లో సంపద సృష్టించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే మద్యం, విద్యుత్‌ సర్‌చార్జీలు పెంచడం ద్వారా రూ.కోట్లల్లో ఆదాయం గడించిన చంద్రబాబు ప్రభుత్వం.. గ్రామీణ ప్రజలపై పన్నుల భారం మోపుతోంది. ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలంటూ కార్యదర్శులకు హుకుం జారీ చేసింది. చేయని పక్షంలో సస్పెండ్‌ చేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తోంది. ఈ పరిణామం పంచాయతీ కార్యదర్శుల్లో ఆందోళన నింపుతోంది.

మెడపై కత్తిలా..

జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం రూ.133.22 కోట్లు వసూలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో ట్యాక్స్‌లో భాగంగా ఇంటి, నీటి పన్నులు, నాన్‌ ట్యాక్స్‌గా ఇండస్ట్రీస్‌, చెరువులు తదితరాల కింద మొత్తం రూ.133.22 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉంది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు లక్ష్యాలను నిర్దేశించింది. ఈ నెల 15వ తేదీలోపు 50 శాతం వసూళ్లు పూర్తి చేయాలని, నెలాఖరుకు 100 శాతం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకుగాను కార్యదర్శుల మెడపై కత్తి పెట్టారు. లక్ష్యాలు అధిగమించకపోతే.. మండలానికి ఒక కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో గ్రామాల్లో కార్యదర్శులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. నిత్యం అదేపనిలో తలమునకలవుతున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.38.74 కోట్లు మాత్రమే వసూలు చేశారు.

ఇదేం తీరు..?

ఏటా ఇంటి పన్నుల వసూళ్లకు మార్చి మాసంలో నోటీసులు జారీ చేస్తారు. ఏప్రిల్‌ నెలాఖరుకు పంచాయతీ కార్యదర్శులు వసూలు చేస్తారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత ప్రక్రియకు మంగళం పాడింది. ప్రజల వద్ద వసూళ్లకు నాంది పలికారు. రాష్ట్ర ప్రభుత్వానికి మరెక్కడా అప్పు పుట్టక ప్రజలపై పడుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకే పన్నులు వసూలు చేసేయాలంటూ కార్యదర్శుల మెడపై కత్తిపెట్టారు. ఈ పరిణామం కార్యదర్శుల్లో ఆవేదన నింపుతోంది. కార్యదర్శి ఉద్యోగం చేయడం కంటే మానుకోవడం మేలంటూ కొందరు వాపోతున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి 50 శాతానికి మించి పన్ను వసూలు చేయలేని కార్యదర్శులను మండలానికి ఒకరిని సస్పెండ్‌ చేస్తామంటూ బెదిరింపులకు దిగడం ఎంతవరకు సమంజసమని ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద గోడౌన్‌ల యాజమాన్యాలు మార్చి నెలాఖరులో తమ పద్దులు సరి చూసుకుని పన్ను కడుతుంటారు.

సమస్యలు అనేకం

పన్నుల వసూళ్లకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ విధానం అవస్థలు తెచ్చిపెడుతోంది. ఎవరైతే తమ ఇంటికి, నీటి పన్నులు చెల్లించాలనుకుంటున్నారో.. వారి మొబైల్‌ నుంచే చెల్లింపులు చేపట్టాల్సి ఉంది. ఇది పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్లు తక్కువగా ఉంటారు. ఆన్‌లైన్‌లో పన్నులు చెల్లించే పరిస్థితి ఉండదు. ఇలాంటి వారు పన్నులు చెల్లించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఒక ఇంటి నంబర్‌తో పన్ను చెల్లింపు ప్రారంభిస్తే.. అందులో ఏదైనా చిన్న సమస్య ఎదురైనా మరో 24 గంటల వరకు సర్వర్‌ స్తంభిస్తోంది. దీంతో ఆ ఇంటి పన్ను తిరిగి చెల్లించాలంటే మరో రోజు వేచి చూడాల్సి వస్తోంది. దీనికి తోడు పంచాయతీ కార్యదర్శులకు గ్రామాల్లో చెత్త సేకరణ ప్రక్రియ పర్యవేక్షించాల్సిన విధులు కేటాయించారు. ఆ విధుల్లోనే ఎక్కువ సమయం సరిపోతోంది. అనంతరం పన్నుల వసూళ్లకు రావాల్సి ఉంది. దీంతో పని ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన చెందుతున్నారు.

నిడదవోలు మండలం పెండ్యాల గ్రామం

జిల్లాలో పన్నుల డిమాండ్‌ ఇలా...

మండలం పన్ను వసూళ్లు

(రూ.కోట్లలో)

రాజమహేంద్రవరం రూరల్‌ 34.73

రాజానగరం 13.02

దేవరపల్లి 6.43

నిడదవోలు 3.23

గోకవరం 3.28

గోపాలపురం 4.09

మండపేట 7.72

కొవ్వూరు 4.55

రంగంపేట 3.30

నల్లజర్ల 5.63

చాగల్లు 3.87

సీతానగరం 4.22

పెరవలి 2.97

తాళ్లపూడి 2.71

కోరుకొండ 3.39

కడియం 10

ఉండ్రాజవరం 3.66

కపిలేశ్వరపురం 2.45

రాయవరం 3.18

బిక్కవోలు 4.90

అనపర్తి 5.89

ఒత్తిడి తీవ్రం

పన్నుల వసూళ్లపై ప్రభుత్వం ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచుతోంది. ఉన్నతాధికారులు కార్యదర్శులపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో చేసేది లేక కార్యదర్శులు అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒత్తిడిని తాళలేక వయసుపైబడిన సీనియర్‌ కార్యదర్శులు బీపీలు, సుగర్‌ బారిన పడుతున్నామని వాపోతున్నారు. కొందరు కార్యదర్శులైతే సెలవులో వెళ్లిపోయేందుకు ప్రత్యామ్నాయ దారులు వెతుకుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగులకు మంచి చేస్తామని ప్రకటనలు ఇచ్చి.. ఇప్పుడేమో పని ఒత్తిడి పెంచడంతో నిరాశ నిస్ప్రహలో కొట్టుమిట్టాడుతున్నామని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement