ఆపదలో అపర సంజీవని
● ఆరోగ్యశ్రీ రద్దుకు
చంద్రబాబు ప్రభుత్వం కుట్ర
● నెట్‌వర్క్ ఆస్పత్రులకు
బిల్లుల చెల్లింపుల్లో నిర్లక్ష్యం
● జిల్లా వ్యాప్తంగా
రూ.250 కోట్లకు పైగా బకాయిలు
● తాజాగా ‘యూనివర్సల్ హెల్త్
పాలసీ’కి సమాలోచనలు
● ఏప్రిల్ నుంచి అమలు చేసేలా సన్నాహాలు
● ప్రశ్నార్థకం కానున్న
ఆరోగ్య మిత్రల భవితవ్యం
సాక్షి, రాజమహేంద్రవరం: పేదలకు ఆధునిక, కార్పొరేట్ వైద్యం అందజేస్తూ, శస్త్ర చికిత్సలు ఉచితంగా చేసి వారి ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న ఆరోగ్యశ్రీ అద్భుత పథకానికి మంగళం పాడేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నట్టు అనిపిస్తోంది. ఈ పథకానికి ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చిన ప్రభుత్వం దానిని కూడా నిలిపివేసేందుకు యోచిస్తోంది. ఆ స్థానంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్దేశ పూర్వకంగానే నెట్‌వర్క్ ఆస్పత్రులకు అందాల్సిన బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తోందా? అంటే అంతేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు, వైద్య మిత్రల ఉద్యోగాలు కొనసాగుతాయా..? లేదా..? అన్న ఆందోళన నెలకొంది.
ఇదీ సంగతి
ఎన్టీఆర్ వైద్యసేవలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 90 ఆస్పత్రులను ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో ప్రైవేటు ఆస్పత్రులు 40, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 5, ప్రైమరీ హెల్త్ సెంటర్లు 28, జీజీహెచ్ 1, ఏరియా ఆస్పత్రి 1, మరో 3 ఎంపిక ప్రక్రియలో ఉన్నాయి. 16 దంత వైద్యశాలల్లో (ఈహెచ్‌ఎస్) సైతం వైద్య సేవలు అందిస్తున్నాయి. వీటిలో సుమారు 60 మంది వైద్య మిత్రలు 17 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరోగ్యశ్రీని ఎత్తేస్తారని వినిపిస్తుండడంతో వారి ఉద్యోగ భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) స్థానంలో ఏప్రిల్ నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకువచ్చేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైనట్లు సమాచారం. ఇందుకు కేవలం రెండు నెలల సమయమే ఉండడంతో వైద్య మిత్రల్లో ఆందోళన నెలకొంది. కొత్త పథకం అమల్లోకి వస్తే 50 శాతానికి పైగా ఉద్యోగాలు ఊడిపోతాయన్న ప్రచారం సాగుతోంది.
గుట్టుచప్పుడు కాకుండా
ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. అందులో సంస్కరణలు తీసుకువచ్చి మరింత మెరుగైన వైద్యాన్ని, మరిన్ని వ్యాధులకు ఆ పథకాన్ని విస్తరించినది మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వారిద్దరి పేర్లను ప్రజల గుండెల్లోంచి తొలగించాలన్న దుర్బుద్ధితో ఆ పథకాన్ని తొలగించి కొత్త పాలసీ తీసుకువస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు జీవో 162 మాత్రమే విడుదల చేసిన సర్కారు సదరు పాలసీ మార్గదర్శకాలు, స్పష్టమైన ఆదేశాలను గుట్టుగా ఉంచినట్టు తెలుస్తోంది. రూ.2 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్, ఆపై మొత్తానికి బీమా కంపెనీల ద్వారా వైద్యం అందించాలనే ప్రతిపాదనలపై ఇప్పటికే అధికారులకు అవగాహన కల్పించినట్లు తెలిసింది. ఆస్పత్రులలోని సిబ్బంది వివరాలు రిజిస్టర్ చేసినట్లు సమాచారం. అయితే తక్కువ ప్యాకేజీల వల్ల బీమా సంస్థలు ముందుకు రావడం లేదని సమాచారం.
నూతన పాలసీపై అయోమయం
ఆరోగ్యశ్రీని తొలగిస్తే మెరుగైన వైద్యం అందుతుందా..? లేదా..? అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ప్రస్తుతం అమలవుతున్న ఎన్టీఆర్ వైద్య సేవలో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల మేర హెల్త్ కవరేజీ లభిస్తోంది. ఈ విధానాన్ని బీమాలోకి తీసుకువస్తే.. క్లెయిమ్‌ల విషయంలో ఏ మేరకు లబ్ధి చేకూరుతుందన్న ప్రశ్నార్ధకమే.
రూ.250 కోట్ల బకాయిలు
తెల్ల రేషన్‌కార్డు దారులకు ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ వర్తింపజేస్తోంది. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేస్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నెట్‌వర్క్ ఆస్పత్రులకు సుమారుగా రూ.250 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు ఆస్పత్రుల యాజమాన్యాలకు గుదిబండగా మారాయి. ఎన్టీఆర్ వైద్యసేవ కేసులంటేనే ఎందుకొచ్చిన అరువు సేవ అని భావిస్తున్నారు. గుండె, చర్మం, ఈఎన్‌టీ, గ్యాస్ట్రో, జనరల్ మెడిసిన్, సర్జరీ, మూత్రపిండ శస్త్ర చికిత్సలు చేసిన ఆస్పత్రులకు బిల్లులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జరిగిన వైద్యానికి ఎలాంటి చెల్లింపులూ చేయలేదు. ఈ పరిణామం పేదలకు ఇబ్బందిగా మారింది. ఖరీదైన శస్త్ర చికిత్సలు తాము ఎలా చేయించుకోవాలంటూ నిట్టూరుస్తున్నారు. దీనిపై ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు.
5 శాతమే విడుదల
జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) నెట్‌వర్క్ ఆస్పత్రులకు సుమారు రూ.250 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. అనేక ఆందోళనల నేపథ్యంలో తలొగ్గిన ప్రభుత్వం 5 శాతం నిధులు మాత్రమే విడుదల చేసింది. మిగిలినవి ఎప్పుడు విడుదల చేస్తుందో స్పష్టత ఇవ్వలేదు.
18 నెలల్లో మూడుసార్లు
మందులు, సర్జికల్ పరికరాల కొనుగోళ్లు, వైద్యులు, సిబ్బందికి జీతాల చెల్లింపులతో పాటు, ఆస్పత్రుల విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నామని ఎన్టీఆర్ వైద్యసేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. బకాయిల చెల్లింపు డిమాండ్‌తో గత ఏప్రిల్‌లో సమ్మెలోకి వెళ్లాయి. అప్పట్లో సీఎం స్థాయిలో చర్చలు జరిపి బిల్లులు చెల్లిస్తామని హామీ పొందారు. అనంతరం ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో మళ్లీ సమ్మెకు దిగారు. మరో సారి ఏకంగా వైద్యమే ఆపేశారు.
పథకం నిలిపివేసేందుకు కుట్ర
ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి, ఆ పథకం స్థానంలో ఆయుష్మాన్ భారత్‌ను తీసుకురావడంపై కూటమి ప్రభుత్వం మక్కువ చూపుతోంది. బీమా పథకం అమలు చేసే యోచనలో ఉంది. ఇందులో వ్యాధుల సంఖ్య 1900 లోపే ఉంటుంది. ప్యాకేజీ సైతం తక్కువగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రులు ఆయుష్మాన్ భారత్‌పై ఆసక్తి చూపడం లేదు. ఇదే జరిగితే నయా పైసా చెల్లించకుండా వైద్యం చేయించుకునే పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం పడనుంది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు (ఫైల్)
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఊపిరి
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 938 వ్యాధులతో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ ప్రస్థానం 3,275 వ్యాధుల వరకు విస్తరించారు. ఇందుకోసం రూ.508,49,95,571 కోట్లు వైద్యం, శస్త్ర చికిత్సల కోసం వెచ్చించగా. 2,48,805 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. వీటిలో బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్‌కు రూ.11.97 లక్షలు, అల్లోజెనిక్ బోన్‌మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు (14 ఏళ్లుపైన) రూ.11 లక్షలు, గుండె మార్పిడికి రూ.10.77 లక్షలు వెచ్చించారు.


