అట్టహాసంగా హాకీ పోటీలు ప్రారంభం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): స్థానిక జిల్లా క్రీడా మైదానంలో కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొదటి కోకనాడ గోల్డ్ కప్ జాతీయ స్థాయి హాకీ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి డీఎస్‌డీఓ వి.సతీష్ కుమార్, హాకీ మాజీ ఇండియన్ కెప్టెన్, పద్మశ్రీ ధనరాజ్ పిళ్లై, కోచ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత బల్‌వీర్ సింగ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ప్రీతమ్ శివాజ్, శాప్ డైరెక్టర్లు రవీంద్ర, జగదీశ్వరి, హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్యరాజ్, కార్యదర్శి హర్షవర్ధన్, అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి హాజరయ్యారు. శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ కాకినాడ డీఎస్‌ఏలో వచ్చే ఏడాది హాకీ అంతర్జాతీయ టోర్నీ నిర్వహణకు అవసరమైన సదుపాయాలు, గ్యాలరీ, టాయిలెట్స్, ఫ్లడ్‌లైట్లు వంటివి ఏర్పాటు చేస్తామన్నారు. ఒలింపియన్ ధనరాజ్ పిళ్లై మాట్లాడుతూ ఈ టోర్నీ వర్థమాన క్రీడాకారులకు స్ఫూర్తిని ఇఽస్తుందన్నారు. కాకినాడకు గతంలో ఒకసారి వచ్చానని, ఇక్కడ టోర్నమెంట్ ఏర్పాట్లు బాగున్నాయన్నారు. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి రవిచంద్రప్రసాద్ మాట్లాడూ కోకనాడ గోల్డ్ కప్ హాకీ పోటీలకు దేశ వ్యాప్తంగా 24 పురుష, మహిళల జట్లు వచ్చాయన్నారు. ఈ నెల 14 వరకూ టోర్నీ జరుగుతుందన్నారు. జాతీయ జెండాను శాప్ చైర్మన్ రవినాయుడు, హాకీ ఆంఽధ్రప్రదేశ్ జెండాను ధనరాజ్ పిళ్లై, కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ జెండాను క్లబ్ అధ్యక్షుడు బాబ్జి ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు సూరిబాబు, ఇమ్మానుయేల్ రాజు, సురేష్‌రాజు, పరుశురాం, హరిబాబు, పీఈటీ సంఘ రాష్ట్ర మాజీ అద్యక్షుడు రవిరాజు, పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి సుధారాణి, డీఎస్‌ఏ కోచ్‌లు సమీర్, సురేష్, అప్పలనాయుడు పాల్గొన్నారు.
తొలిరోజు నాలుగు మ్యాచ్‌లు
డీఎస్‌ఏ మైదానంలో ప్రారంభమైన కోకనాడ గోల్డ్ కప్ హాకీ పోటీల్లో భాగంగా తొలిరోజు నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. మహిళల విభాగంలో ఎస్‌సీఓఈ భోపాల్, హర్యానా మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్యానా జట్టు, ఎన్‌సీఓఈ సోనిపత్, బిలాయ్ స్టీల్‌ప్లాంట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎన్‌సీఓఈ జట్టు విజయం సాధించాయి. యూనియన్ బ్యాంక్, గ్వాలియర్ ఎంపీ అకాడమీ జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. పురుషుల విభాగంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఆర్మీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ ఆర్మీ జట్టు విజయం సాధించిందని నిర్వాహకులు ప్రకటించారు.


