హోంగార్డు ఇంట్లో రూ.4.45 లక్షల సొత్తు చోరీ
అనపర్తి: బిక్కవోలులోని హోంగార్డు ఇంట్లోకి దొంగలు పడి నగలు, నగదు చోరీ చేశారు. ఎస్సై వి.రవిచంద్ర కుమార్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. జి.మామిడాడ రోడ్డులోని లక్ష్మీనారాయణస్వామి ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న ఉర్లంకుల సత్యకృష్ణ ప్రసాద్ కాకినాడలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్ద హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన ఇంట్లోకి సోమవారం అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో దొంగలు చొరపడ్డారు. ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి లోపలకు వచ్చారు. ఇంట్లోని ఇనుప బీరువాను పగులకొట్టి రూ.4,10 లక్షలు, 14 గ్రాముల బంగారం కలిపి సుమారు రూ.4.45 లక్షల విలువైన సొత్తును చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలాన్ని అనపర్తి సీఐ వీఎల్‌వీకే సుమంత్ పరిశీలించారు.
పూరీలు చేయలేకపోతున్నాం
రాజోలు: తెల్లవారుజామునే తమతో పూరీలు చేయిస్తున్నారని, దీంతో నిద్ర సరిపోవడం లేదని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ వద్ద శివకోటి గురుకుల పాఠశాల విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం శివకోటి గురుకుల బాలిక పాఠశాలను తనిఖీ చేశారు. దీనిలో భాగంగా విద్యార్థినులతో మాట్లాడారు. తమకు వడ్డిస్తున్న కూరలు రుచిగా ఉండడం లేదని, చికెన్ పీసులు తక్కువ వేస్తున్నారని తెలిపారు. కాగా.. తనిఖీల్లో భాగంగా పాడైపోయిన కూరగాయలు, చిక్కిలను ఆయన గుర్తించారు. విద్యార్థినులతో పూరీలు చేయించడంపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గురుకుల పాఠశాల జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే కూనవరం జెడ్పీ హైస్కూల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు.


