పన్నులు వసూలైతేనే పురాభివృద్ధి
● మున్సిపల్ ఆర్డీ నాగ నరసింహారావు
● కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష
అమలాపురం టౌన్: ప్రజలు పన్నులు నూరుశాతం చెల్లించినపుడే మున్సిపాలిటీలు పురోభివృద్ధి సాధిస్తాయని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ సీహెచ్ నాగ నరసింహరావు అన్నారు. వచ్చే మార్చి నెలాఖరు నాటికి పన్నులను పూర్తి స్థాయిలో చెల్లించి మున్సిపాలిటీల అభివృద్ధికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని 6 మున్సిపాలిటీల కమిషనర్లతో వారి పరిధిలో పన్నులు, పనుల స్థితిగతులపై శుక్రవారం సమీక్షించారు. అంతకు ముందు ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆస్తి, తాగునీరు, ఖాళీ స్థలాల పన్నుతో పాటు ప్రకటనల పన్ను, ట్రేడ్ లైసెన్సులు, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లలో అద్దెలను సకాలంలో చెల్లించాలని కోరారు. రెండు జిల్లాల పరిధిలోని అమలాపురం, రామచంద్రపురం, ముమ్మిడివరం, మండపేట, నిడదవోలు, కొవ్వూరు మున్సిపాలిటీల్లో జనవరి నెలాఖరు నాటికి అమలాపురం మున్సిపాలిటీలో ఆస్తి పన్ను 49.83 శాతం, తాగునీటి పన్ను 46.81 శాతం, నిడదవోలు మున్సిపాలిటీలో 52.83 శాతం, 44.06 శాతం, రామచంద్రపురం మున్సిపాలిటీలో 57.16 శాతం, 10.7 శాతం, మండపేట మున్సిపాలిటీలో 59.83 శాతం, 15.64 శాతం, ముమ్మిడివరం నగర పంచాయతీలో 62.68 శాతం, 7.07 శాతం, కొవ్వూరు మున్సిపాలిటీలో 67.79 శాతం, 33.27 శాతం వసూలైనట్టు తెలిపారు. సమీక్షలో భాగంగా దోమలు, పందులు, కుక్కుల బెడద అంశాలపై చర్చించారు. దాదాపు రూ. 5 కోట్లతో ప్లాస్మా టెక్నాలజీలో పది టన్నుల చెత్తను ప్రాసెసింగ్ చేసే యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.


