ఘనంగా చండీహోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి పండితులు ప్రత్యేక పూజలు చేసి, చండీహోమం ప్రారంభించారు. పూర్ణాహుతి అనంతరం అమ్మవార్లకు వేదాశీస్సులు, నివేదనలు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. వేద పండితులు అమరేశ్వర ఘనపాఠి, వనదుర్గ ఆలయ అర్చకుడు ప్రయాగ రాంబాబు, వ్రత పురోహితులు దేవులపల్లి ప్రకాష్, కూచుమంచి ప్రసాద్, పరిచారకులు హోమం నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్‌తో పాటు 30 మంది భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, రత్నగిరి తొలి పావంచా వద్ద కనకదుర్గ అమ్మవారికి పరిచారకుని ఆధ్వర్యంలో పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు.


