‘నన్నయ’లో ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెల్
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెల్‌ని ఏర్పాటు చేశారు. దీనికి డైరెక్టరుగా ఆచార్య పి.సురేష్‌వర్మ, సభ్యులుగా ఆచార్య వై. శ్రీనివాసరావు, ఆచార్య డి.జ్యోతిర్మయి, ఆచార్య కె.రమణేశ్వరి, ఆచార్య బి.జగన్‌మోహన్‌రెడ్డి, డాక్టర్ టి.హైమావతి, ఎస్.లింగారెడ్డి, ఎన్.నాగేంద్రరావును నియమిస్తూ వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ ఆదేశాలు జారీ చేశారు. గురువారం నిర్వహించిన తొలి సమావేశంలో యూనివర్సిటీలో నాణ్యత ప్రమాణాలను పెంచడం ద్వారా ప్రస్తుతం ఉన్న నాక్ బి ప్లస్ గ్రేడ్ లో ఉన్నతిని పొందేందుకు అంతా కృషి చేయాలని వీసీ సూచించారు.
జీఎన్‌ఎం పరీక్షలు ప్రారంభం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ సమగ్ర బోధనాసుపత్రిలో జీఎన్‌ఎం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీవీవీ.సత్యనారాయణ ఆ వివరాలను తెలిపారు. ఈ పరీక్షలు ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జిల్లాలోని సుమారు 20 ప్రైవేటు నర్సింగ్ కాలేజీలకు చెందిన దాదాపు 900 మంది నర్సింగ్ (ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల) విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు ఎలాంటి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు.
మహాలింగేశ్వరస్వామి
ఆలయానికి రూ.11 లక్షల విరాళం
దేవరపల్లి: మండలంలోని గౌరీపట్నంలో స్వయంభుగా వెలసిన గౌరీ సమేత మహాలింగేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి గ్రామానికి చెందిన ఆండ్రు హరిచంద్ర ప్రసాదరావు, పూర్ణదంపతులు రూ.11,11,111 విరాళంగా అందజేశారు. విరాళాన్ని దేవస్థానం ట్రస్టు సభ్యులకు అందజేశారు. గతంలో ఈ విరాళంలో రూ.5 లక్షలు అందజేయగా, మిగిలిన మొత్తాన్ని ఇప్పుడు అందజేసినట్టు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. హరిచంద్ర ప్రసాదరావు దంపతులను ట్రస్ట్ సభ్యులు అభినందించారు.
తత్కాల్‌లో 10వ తరగతి
పరీక్ష ఫీజు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులకు తత్కాల్ స్కీం ద్వారా అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కే.వాసుదేవరావు గురువారం తెలిపారు. రూ.1,000 ఆలస్య రుసుముతో చెల్లించాలన్నారు. ఆయా స్కూల్స్ హెచ్‌ఎంలు అపరాధ రుసుముతో ఈ నెల 12వ తేదీలోగా చెల్లించాలన్నారు. పరీక్ష ఫీజు రుసుము తేదీ ఎట్టి పరిస్థితుల్లోను పొడిగించబోమన్నారు.


