వృద్ధురాలి మెడలో పుస్తెల చోరీ
రాయవరం: నడుస్తూ వెళ్తున్న వృద్ధురాలి మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును చోరీ చేసిన ఘటన రాయవరంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పులగం లక్ష్మి భర్తతో కలిసి కిరాణా వ్యాపారం చేస్తుంటుంది. షాపు నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక యువకుడు సెల్‌ఫోన్ చూస్తున్నట్టు నటిస్తూ ఆమె దగ్గరకు రాగానే ఆమె మెడలోని 11 కాసుల పుస్తెల తాడును గట్టిగా లాగాడు. వృద్ధురాలు ప్రతిఘటించడంతో ఒక మంగళసూత్రం, సగం బంగారు గొలుసు దొంగ చేతికి చిక్కగా, మిగిలిన సూత్రం, సగం గొలుసు వృద్ధురాలి వద్ద ఉంది. దీంతో ఆమె మెడ వద్ద గాయమైంది. ఆమె వేసిన కేకలకు భర్త పరుగున వచ్చి ఆ యువకుడి కోసం వెదకగా అప్పటికే అతడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ పి.దొరరాజు ఘటనా స్థలానికి చేరుకుని సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించి వచ్చిన వ్యక్తి 18 ఏళ్ల యువకుడిగా అనుమానిస్తున్నారు. చోరీకి గురైన బంగారం విలువ రూ.3.50 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. ఆమెను నిత్యం గమనిస్తున్న వ్యక్తే ఈ చర్యలు పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధురాలి మెడలో పుస్తెల చోరీ


