చితికిన బతుకులు
● లారీ ఢీకొని ఇద్దరు మృతి
● వీధిన పడిన కుటుంబాలు
తాళ్లపూడి/ దేవరపల్లి: బతుకులు చితికిపోయాయి.. ఆ కుటుంబాలు పెద్దలను కోల్పోయి వీధిన పడ్డాయి.. లారీ మృత్యువై వెంటాడి అనంత లోకాలకు దూసుకుపోయింది.. కొవ్వూరు– రాజమహేంద్రవరం గామన్ బ్రిడ్జిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పట్టణ సీఐ విశ్వం, పోలీసుల కథనం ప్రకారం.. దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన వెలగన కోట సత్యనారాయణ (40), తాతపూడి చిన్న సుబ్బారావు (36)లు లోడింగ్ ట్రాక్టర్లపై డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఆ ట్రాక్టర్లు కోరుకొండలో ఉండడంతో డ్యూటీ ఎక్కడానికి ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలు దేరారు. ఈ నేపథ్యంలో వారు కొవ్వూరులోకి గామన్ బ్రిడ్జిపై నుంచి మోటార్ సైకిల్‌పై వెళ్తున్నారు. ఈ సమయంలో వారి మోటారు సైకిల్‌ను లారీ ఢీకొంది. వారు లారీ వెనక చక్రాల కింద పడ్డారు. కోట సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా, చిన సుబ్బారావును ఆసుపత్రి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. మృతుల శరీర భాగాలు నుజ్జునుజ్జు కావడంతో భయానక వాతావరణం నెలకొంది. మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువుల రోదనలతో ఆసుపత్రి వద్ద హృదయవిదారక వాతావరణం నెలకొంది.
దుద్దుకూరులో విషాద ఛాయలు
ఈ ఘటనతో దుద్దుకూరు గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. అందరితో మంచిగా ఉంటూ, ఆప్యాయతగా పలకరించే కోట సత్యనారాయణ, చిన సుబ్బారావు(40) మృతితో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలు దేరి వెళ్లిన కొద్దిసేపటికే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. చిన సుబ్బారావుకు తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రదీప్, 4వ తరగతి చదువుతున్న కుమార్తె సంజన ఉండగా, కోల సత్యనారాయణకు 15 ఏళ్ల కుమారుడు చైతన్య, 6వ తరగతి చదువుతున్న కుమార్తె మౌనిక ఉన్నారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి వెళ్లారు.
ప్రమాదానికి కారణమదేనా!
కొద్దిరోజులుగా గామన్ బ్రిడ్జిపై మరమ్మతులు చేస్తున్నారు. ఒకవైపు దారిలోనే ఇరుపక్కల వాహనాలను పంపుతున్నారు. ఇక్కడ సరైన పర్యవేక్షణ లేక తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించడానికి కూడా ఇదే కారణమని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నిత్యం భారీ వాహనాల సంచారంతో రద్దీగా ఉండే ఈ రోడ్డులో వాహనాల వేగానికి కూడా కళ్లెం లేకపోయింది. ఇప్పటికై నా పోలీసు అధికారులు సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
చితికిన బతుకులు
చితికిన బతుకులు


