సైబర్ మోసాల నివారణకు చర్యలు
అమలాపురం రూరల్: ఇటీవల కాలంలో జరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. అమలాపురం రూరల్ సీఐ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలసి బుధవారం ఆయన తనిఖీ చేశారు. అక్కడ ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో సీబీఐ డిజిటల్ అరెస్టుల పేరుతో జరిగే సైబర్ మోసాలు తగ్గినట్లు తెలిపారు. దీనిలో ఓ ముఠాను అరెస్టు చేశామని అన్నారు. ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులను లక్ష్యంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, వీటిపై బ్యాంకు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి డిపాజిట్లు విత్ డ్రాల్లో జాగ్రత్తలు పాటించాలని ఆదేశించామని అన్నారు.
అయినవిల్లి: వార్షిక తనిఖీల్లో భాగంగా అయినవిల్లి పోలీస్ స్టేషన్‌లో రికార్డులను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ పరిశీలించారు. ఇటీవల సంక్రాంతి సంబరాలు, ప్రభల ఉత్సవాలు, అంతర్వేది నరసన్న తీర్థ మహోత్సవాలు ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసు బందోబస్తు నిర్వహించారన్నారు. శివరాత్రి మహోత్సవాల్లో వివాదాలకు తావులేకుండా ఇప్పటికే పోలీసు శాఖ అప్రమత్తమైందన్నారు. అభ్యంతరం లేని పోస్టులు మాత్రమే సోషల్ మీడియాలో పెట్టాలన్నారు. ఈ పోస్టుల కారణంగా ఏ వివాదం జరిగినా నిందితులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు.


