పుష్కరాలను సమష్టిగా విజయవంతం చేద్దాం
● రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్
● సన్నద్ధతపై అధికారులతో సమీక్ష
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వచ్చే ఏడాది జూన్ 26న ప్రారంభమయ్యే పుష్కరాలను సమిష్టి కృషితో నిర్వహించి విజయవంతం చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పుష్కర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆయన కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షించారు. పుష్కరాల నిర్వహణలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, దేవదాయ, పర్యాటక, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి అధికారులు, హెచ్‌వోడీలతో కలిసి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని తెలిపారు. నవ జనార్దన పారిజాతం (వైష్ణవ క్షేత్రాలు), ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను అనుసంధానిస్తూ పర్యాటక ప్యాకేజీలు రూపొందించనున్నట్లు తెలిపారు. పాపికొండల పర్యాటకాన్ని కూడా పుష్కరాల పర్యాటక ప్రణాళికలో భాగం చేస్తామని వెల్లడించారు. కోట్లాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కుంభమేళా తరహాలో అత్యున్నత ప్రమాణాలతో టెంట్ సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఏ ఘాట్‌లో స్నానం చేసినా పుణ్యఫలం సమానమే అన్న విషయంపై భక్తుల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించామన్నారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి అన్ని పనులు ఇప్పటికే ఉన్న బడ్జెట్‌కు అనుగుణంగా, స్పష్టమైన లక్ష్యాలు, సమ్మతమైన విధానం ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా ప్రజాప్రతినిధులు, ఎస్పీ డి.నరసింహ కిశోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు.


