తావీదు చూపించి.. బంగారంతో ఉడాయించి | - | Sakshi
Sakshi News home page

తావీదు చూపించి.. బంగారంతో ఉడాయించి

Feb 5 2026 7:26 AM | Updated on Feb 5 2026 7:26 AM

తావీద

తావీదు చూపించి.. బంగారంతో ఉడాయించి

రాజవొమ్మంగి: తావీదు ఇస్తాం.. నీ సమస్యలన్నీ తీరిపోతాయని ఇద్దరు నమ్మించి బంగారం దోచుకెళ్లిన ఘటన రాజవొమ్మంగి మండలం కొమరాపురంలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం... కొమరాపురం గ్రామానికి చెందిన కోసూరి లోవకుమారి రాజవొమ్మంగి వెళ్లేందుకు బయలు దేరింది. ఆ గ్రామంలో ఆటో కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో మోటారు సైకిల్‌పై ఇద్దరు వచ్చి తాము లిఫ్ట్‌ ఇస్తామని చెప్పి ఎక్కించుకున్నారు. మార్గం మధ్యలో బండి ఆపి ‘నీ కుమార్తెకు ఆరోగ్యం బాగాలేదు, ఇంకా నీవు ఎన్నో కష్టాల్లో ఉన్నావు, తాము ఇచ్చే తావీదు కట్టుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయని’ అని నమ్మించారు. ఆమె చేతిలో రాగి రేకు, తావీదు పెట్టి, ఆమె చెవి కమ్మలు తీసుకుని, వాటితో ఆమెకు దిష్టి తీస్తున్నట్లు నటించి అంతలోనే పరారయ్యారు. ఈ పరిణామానికి అవాక్కయిన లోవకుమారి తాను మోసపోయానని గ్రహించింది. దీనిపై జడ్డంగి స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చినబాబు తెలిపారు. ఇటువంటి మోసాలు జరగకుంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

12 మందికి గాయాలు

శంఖవరం: కత్తిపూడి ఫ్లైవర్‌ బ్రిడ్జి కింద బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. అన్నవరం పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కత్తిపూడి బస్‌ కాంప్లెక్స్‌ సమీపంలో పిఠాపురం నుంచి రౌతులపూడి వెళ్తున్న టిప్పర్‌ను అన్నవరం నుంచి వస్తున్న ఆటో ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. యు.కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన 15 మంది కూలీలు ప్రత్తిపాడు మండలం ధర్మవరంలోని సరుగుడు తోట నరికేందుకు ఆటోలో వెళ్తున్నారు. కత్తిపూడి బస్‌ కాంప్లెక్స్‌ సమీపానికి వచ్చేసరికి మలుపులో టిప్పర్‌ను ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలోని కొత్తపల్లి మండలం శ్రీరామపురానికి చెందిన పితాని కామరాజు (65) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు పీహెచ్‌సీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు.

విద్యుత్‌ స్తంభాన్ని

ఢీకొన్న కళాశాల బస్సు

అమలాపురం రూరల్‌: ఓ కళాశాల బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బుధవారం ఉదయం ఉప్పలగుప్తం మండలం నుంచి అమలాపురంలో ఓ కళాశాలకు విద్యార్థులతో బస్సు వెళ్తోంది. సమనస వైన్‌ షాప్‌ సమీపంలో ఆ బస్సు అదుపుతప్పి పంట కాలువ వైపు దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. తీగలు తెగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులంతా క్షేమంగా బయట పడ్డారు. బస్సును నిర్లక్ష్యంగా నడిపినందుకు డ్రైవర్‌ లైసెన్స్‌ను, బస్సు పర్మిట్‌ను మూడు నెలలు సస్పెండ్‌ చేశామని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. డ్రైవర్‌ సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ బస్సును వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు త్వరలోనే పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలకు సమావేశాలు నిర్వహిస్తామని డీటీఓ చెప్పారు.

తావీదు చూపించి..  బంగారంతో ఉడాయించి 1
1/1

తావీదు చూపించి.. బంగారంతో ఉడాయించి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement