అంతా మా ఇష్టం.. | - | Sakshi
Sakshi News home page

అంతా మా ఇష్టం..

Feb 10 2026 7:42 AM | Updated on Feb 10 2026 7:42 AM

అంతా

అంతా మా ఇష్టం..

అర్ధరాత్రి రోడ్డును తవ్వేసి తూరల ఏర్పాటు

రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని

అధికారులు

పెరవలి: అధికారం చేతిలో ఉందని కొందరు రోడ్డును తవ్వేసి తూరలు ఏర్పాటు చేయడం ఆందోళనకు దారి తీసింది.. దీనిని అడ్డుకోవాల్సిన అధికారులు మౌనం వహించడం విమర్శలకు తావిచ్చింది.. పెరవలి మండలం నడుపల్లి–నడుపల్లి కోట రోడ్డులో జరిగిన తంతు ఇది. నడుపల్లి నుంచి నడుపల్లి కోట వరకూ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.50 కోట్లు మంజూరు చేసింది. గ్రామమంతా సీసీ రోడ్డు, బయట తారు రోడ్డు వేసేలా ప్రతిపాదనలు తయారు చేసి అంచనాలు వేశారు. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండగా, నాలుగు రోజుల కిందట నడుపల్లి కోట వద్ద తూరలు ఏర్పాటు చేయాలని అధికారులను అడిగితే కుదరదని చెప్పడంతో కూటమి నేతలు ఆగ్రహించారు. ఎప్పుడూ లేనిది ఇక్కడ తూరలు ఏర్పాటు చేయడం ఏంటని, అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు చేస్తారా అంటూ నడుపల్లికోట రైతులు నిలదీశారు. కానీ తూరలు పెడతాం.. ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ కూటమి నేతలు అనడంతో రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంతో అటువంటి పనిచేయవద్దని నేతలను హెచ్చరించారు. ఆదివారం అర్ధరాత్రి పొక్లెయినర్‌తో కూటమి నేతలు రోడ్డును అడ్డంగా తవ్వేసి తూరలు ఏర్పాటు చేశారు. సోమవారం చేల వద్దకు వచ్చిన రైతులు ఇదేం దారుణమని అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. దీనిపై జిల్లా పరిషత్‌ ఏఈ అగస్టీన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా తూరలు పెట్టడానికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, వారు అనధికారకంగా పెట్టారన్నారు. రోడ్డును తవ్వేశారు కదా.. చర్యలు తీసుకుంటారా అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. దీనిపై కోర్టును ఆశ్రయించడానికి వెళ్తున్నట్లు కొందరు రైతులు తెలిపారు.

తవ్వేసి తూరల ఏర్పాటు

కూటమి నేతలు ఇష్టారాజ్యంగా అడ్డదిడ్డంగా రోడ్డును తవ్వేసి తూరులు ఏర్పాటు చేశారు. అధికారులను అడుగుతుంటే మాకేమీ తెలియదని చెబుతున్నారు. అర్ధరాత్రి తూరలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. దీనివల్ల మా పంట చేలు మునిగిపోతాయి.

–పరిమి సూర్యారావు, రైతు, నడుపల్లి

కుదరదని చెప్పినా..

రోడ్డును తవ్వి తూరలు పెడతామని కూటమి నేతలు అంటుంటే రైతులంతా కలసి కుదరదని చెప్పాం. దీనిపై అధికారులకు ఫిర్యాదులు చేశాం. పోలీసులకు చెప్పాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు. అర్ధరాత్రి దౌర్జన్యంగా తూరలు పెట్టారు. ఇదేం పాలన.

–పరిమి బాలాజీ,

రైతు, నడుపల్లికోట

అంతా మా ఇష్టం..1
1/2

అంతా మా ఇష్టం..

అంతా మా ఇష్టం..2
2/2

అంతా మా ఇష్టం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement