ఉత్సాహంగా పరుగు పోటీలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో ఇంటర్ కాలేజియేట్ క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా బుధవారం 10 కిలోమీటర్ల పరుగు పోటీలు నిర్వహించారు. రాజానగరంలోని సాయిబాబా గుడి నుంచి కానవరం వెళ్లి తిరిగి వచ్చే విధంగా జరిగిన ఈ పోటీలను స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ, రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలల నుంచి 40 మంది పురుషులు, 30 మంది మహిళలు హాజరయ్యారు. పురుషుల విభాగంలో నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని చేరుకున్న కె.హేమంత్ (రాజమహేంద్రవరం) ప్రథమ స్థానం, జె.సతీష్ (గోపన్నపాలెం) ద్వితీయ, ఇ.సురేష్‌రెడ్డి (రాజమహేంద్రవరం) తృతీయ స్థానం దక్కించుకున్నారు. వీరితోపాటు కె.మణికంఠ, ఎం.లీలాగణేష్, సీహెచ్ మల్లికార్జునలను యూనివర్సిటీ టీమ్‌గా ఎంపిక చేశారు. మహర్షి దయానంద యూనివర్సిటీ (రోహ్తక్)లో ఈ నెల 15న జరిగే ఆల్ ఇండియా క్రాస్ కంట్రీ పోటీల్లో వీరు పాల్గొంటారని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు తెలిపారు. అలాగే మహిళా విభాగంలో బి.అర్చన (భీమవరం) ప్రథమ, టి.సురేఖరత్నం (రాజమహేంద్రవరం), సీహెచ్ అనితలు ద్వితీయ, తృతీయ స్థానాలు పొందారు. యూనివర్సిటీలో టీమ్‌లో ఈ ముగ్గురితో పాటు కె.కల్యాణి, ఎ.విజయ, టి.ఉదయలక్ష్మి ఎంపికయ్యారు. కర్ణాటక మంగుళూరులోని యూనివర్సిటీలో 27న జరిగే ఆల్ ఇండియా క్రాస్ కంట్రీ పోటీల్లో దీరు పాల్గొంటారని డాక్టర్ సుబ్బారావు తెలిపారు.


