బాబు మార్కు కర్కశం
శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
● అభాగ్యుల అవస్థలు పట్టించుకోని సర్కారు ● కలగానే కొత్త పింఛన్ల మంజూరు
● చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే తీరు ● కొత్త పింఛన్ల ఊసెత్తని సర్కారు
● 18 నెలలుగా తప్పని నిరీక్షణ ● జిల్లావ్యాప్తంగా 40,000కు పైగా ప్రజల దరఖాస్తులు
● గత వైఎస్సార్ సీపీ హయాంలో అర్హత ఉంటే మంజూరు ● జిల్లా వ్యాప్తంగా 2,71,344 పింఛన్లు
సాక్షి, రాజమహేంద్రవరం: అభాగ్యులపై చంద్రబాబు ప్రభుత్వం ‘పచ్చ’పాతం చూపుతోంది. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఆసరా కల్పించే సామాజిక భద్రత పింఛన్ల మంజూరులోనూ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్నా.. స్పౌజ్ కోటా (భర్త చనిపోతే భార్యకు) మినహా ఒక్క కొత్త పింఛను మంజూరు చేసిన దాఖలాలు లేవు. మరోవైపు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. దరఖాస్తులు తీసుకోవడమే తప్ప.. ఎప్పుడు మంజూరు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి వారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి వెళ్లి అర్జీలు ఇవ్వడం.. వెనుదిరిగి రావడం మినహా చేసేది లేక మిన్నకుండిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేలకు పైగా లబ్ధిదారులు తమకు పింఛను మంజూరు చేయాలని ఎంపీడీఓ కార్యాలయాలు, గ్రీవెన్స్‌లో దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. వీరికి పింఛన్ ఎప్పుడు అందుతుందో అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
స్పౌజ్ కోటాలో మాత్రమే మంజూరు
వితంతు పింఛను మంజూరులో కూటమి సర్కారు కొత్త తరహా నిబంధనలు అమలు చేస్తోంది. 2023వ సంవత్సరం నవంబర్ నెల తర్వాత చనిపోయిన పింఛన్ లబ్ధిదారుల భార్యలకు మాత్రమే స్పౌజ్ కోటాలో పింఛన్లు అందజేసేందుకు నిర్ణయం తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు ఆరు వేల మందికి మాత్రమే మంజూరు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కొత్తగా వితంతు పింఛను కావాలంటూ వచ్చిన దరఖాస్తులు సుమారు ఎనిమిది వేలకు పైగా ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా పింఛనుకు దూరమవుతున్నారు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వితంతువులను ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలు విధించి పట్టించుకోకుండా పోవడం ఎంత వరకూ సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని నిబంధన తీసుకురావడంపై మండిపడుతున్నారు. ఇదేం నిబంధనంటూ నిట్టూరుస్తున్నారు. ఇలాగైతే కొత్త పింఛన్లు అందుతాయా.? అన్న మీమాంస ప్రజల్లో నెలకొంది.
ప్రధానంగా ఆ వర్గాలే
టార్గెట్‌గా..
పింఛన్ల కోతలో ప్రధానంగా కొన్ని వర్గాలపై దృష్టి పెట్టింది. అనర్హతను గుర్తించే పనిలో డీఆర్‌డీఏ అధికారులు సర్వే నిర్వహించారు. ఒంటరి మహిళ, డప్పు కళాకారులు, వికలాంగులు, వృద్ధులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, చర్మకారులు, అభయహస్తం పింఛన్లపై దృష్టి పెట్టి తొలగించారు.
దివ్యాంగ పింఛన్లపై హైడ్రామా..
దివ్యాంగులపై చంద్రబాబు సర్కారు నిర్దయగా వ్యవహరించింది. వైకల్య శాతం తగ్గించేసి అనర్హత పేరుతో అడ్డగోలుగా పింఛన్లు తొలగించే ఎత్తుగడ వేసింది. కేవలం మంచానికే పరిమితమైనా.. మానసిక వికలాంగులుగా ఉన్నా.. కనీస కనికరం లేకుండా నోటికాడ కూడును లాగేయాలని చూసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 33,688 మంది దివ్యాంగ కేటగిరిలో ప్రతి నెలా పింఛన్లు పొందుతున్నారు. వారిలో 1,321 మంది వివిధ రకాల హెల్త్ పింఛన్లు (రూ.15 వేలు) తీసుకుంటున్నారు. మిగిలిన 32,367 మంది రూ.6 వేల పింఛను పొందుతున్నారు. పింఛన్ల తొలగింపులో భాగంగా 19,928 మందికి సంబంధించిన వైకల్య శాతం తిరిగి పరిశీలించారు. వారిలో 3,211 మందికి ప్రభుత్వ నిబంధనల మేరకు వైకల్య శాతం లేదని నిర్ధారించారు. వీరిని అనర్హులుగా గుర్తించి పింఛన్లు రద్దు చేసినట్లు ఆయా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నోటీసులు అందించారు. దీనిపై దివ్యాంగులు పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. వైఎస్సార్ సీపీ నేతలు ఉద్యమాల్లో పాల్గొని ప్రభుత్వ చర్యలను ఖండించారు. ప్రజా వ్యతిరేకతను చూసిన ప్రభుత్వం తొలగించకుండా తాత్కాలికంగా ఆపింది.
గత ప్రభుత్వ హయాంలో..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అర్హతే ప్రామాణికంగా కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. మధ్య వర్తులు, దళారులతో పనిలేకుండా దరఖాస్తు చేసుకున్న వెంటనే అందేవి. ఏటా జనవరి, జూలై నెలల్లో కొత్తవి అందజేసేవారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు మంజూరయ్యేవి. గ్రామ, వార్డు వలంటీర్లు ఇళ్ల వద్దకే వెళ్లి అందజేసేవారు.
జిల్లాలో ఇలా...
ప్రతి నెలా జిల్లా వ్యాప్తంగా 2,71,344
పింఛన్లు అందజేస్తున్నారు. ఇందుకు ప్రతి నెలా రూ.118 కోట్లు చెల్లిస్తున్నారు.
మండలం లబ్ధిదారులు
రాజమహేంద్రవరం అర్బన్ 27,814
రాజానగరం 15,301
దేవరపల్లి 10,776
నల్లజర్ల 11,291
గోపాలపురం 8,912
చాగల్లు 7,130
నిడదవోలు 10,190
కోరుకొండ 11,992
పెరవలి 10,069
రాజమహేంద్రవరం రూరల్ 19,745
గోకవరం 10,280
ఉండ్రాజవరం 10,180
సీతానగరం 11,288
మండపేట 11,609
50 ఏళ్లకే పింఛన్ హామీ ఏమైందో..?
తమ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే 50 ఏళ్లకే పింఛను మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు దాటుతున్నా.. ఆ హామీకి నేటికీ అతీగతి లేదు. అసలు ఇస్తారా..? లేదా..? అన్న విషయమై స్పష్టత కరవైంది. జిల్లా వ్యాప్తంగా 50 ఏళ్లు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలు సుమారు 2 లక్షల మంది ఉంటారు. వీరందరూ హామీ అమలు కోసం నిరీక్షిస్తున్నారు.
ప్రణాళికాబద్ధంగా..
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అడ్డగోలుగా తొలగించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకుగాను 50 రోజుల ప్రణాళికను అమలు చేసింది. కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని నమ్మబలుకుతూనే.. ఉన్న వాటిలో అనర్హతల పేరుతో అత్యధికంగా పింఛన్లు తీసివేసేంది. జిల్లా వ్యాప్తంగా 20 వేలకు పైగా పింఛన్లు తొలగించినట్టు సమాచారం.
బాబు మార్కు కర్కశం


