తిరువనంతపురం: కేరళలో కొత్తగా కొలువుదీరిన యూడీఎఫ్ (యూడీఎప్) ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రకటించిన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకం ఒకవైపు ఆడపడుచుల్లో ఆనందం నింపుతున్నా.. ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. జూన్ 15 నుంచి కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో అమలు కానున్న ఈ పథకంతో అటు రవాణా వ్యవస్థకు, ఇటు రాష్ట్ర ఖజానాకు మోయలేనంత ఆర్థిక భారం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రైవేట్ రవాణా వ్యవస్థకు ఉరితాడు!
కేరళలో దాదాపు 80 శాతానికి పైగా ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల పైనే ఆధారపడి ఉన్నారు. మహిళలకు కేఎస్‌ఆర్‌టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తే, తమ బస్సుల్లో కేవలం విద్యార్థులు మాత్రమే మిగులుతారని, ఇది ప్రైవేట్ బస్ సెక్టార్‌ను నాశనం చేస్తుందని ఆపరేటర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కనీసం డీజిల్ కొట్టించడానికి, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండవని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. గోపీనాథన్ వాపోతున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రిని, రవాణా శాఖ మంత్రిని కలిసి తమ సమస్యను వివరించనున్నట్లు వారు తెలిపారు.
అప్పుల కుప్పగా మారనున్న కేరళ?
ఈ ఉచిత హామీతో రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కేరళ తీవ్ర ఆర్థిక లోటుతో సతమతమవుతోంది. రోజువారీ ఖర్చుల కోసం కూడా అప్పులు చేయాల్సిన ఈ తరుణంలో.. అదనపు సంక్షేమ పథకాలతో సబ్సిడీ భారం లక్ష కోట్ల రూపాయలు దాటే ప్రమాదం ఉందని, తద్వారా అభివృద్ధి పనులు కుంటుపడతాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన కేఎస్‌ఆర్‌టీసీ సంస్థకు ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పొరుగు రాష్ట్రాల పాఠాలు ఏవి?
కర్ణాటకలో అమలు చేస్తున్న ‘శక్తి’ పథకానికి ఏటా రూ. 5,300 కోట్లు ఖర్చవుతుండటంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడింది. తెలంగాణలో కూడా ఉచిత ప్రయాణ హామీతో ఆర్థిక ఒత్తిడి పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, మహిళలందరికీ కాకుండా, మత్స్యకార్మికులు, కార్మికుల వంటి అట్టడుగు వర్గాలకు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేస్తే ఆర్థికంగా అంతగా ఇబ్బందులు ఎదురుకావని సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆర్జీ కర్ కేసు: సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి


