ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం | Uttarakhand Rishikesh Ujjaini Express Accident Details | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం

May 19 2026 7:04 AM | Updated on May 19 2026 7:09 AM

Uttarakhand Rishikesh Ujjaini Express Accident Details

ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం జరిగింది. రుషికేష్‌ సమీపంలో ఉజ్జయిని ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో రైలు ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే దేశవ్యాప్తంగా గత మూడు రోజుల్లో వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకోవడం రైల్వే భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 

రుషికేశ్‌ సమీపంలో ఖాంద్‌ గ్రామం వద్ద యోగనగరి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంజిన్‌తో పాటు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. అధికారులు వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టారు. రాత్రంతా రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్‌, జీఆర్పీ బృందాలు సంఘటనా స్థలంలో పనిచేశాయి. బోగీలను తొలగించడానికి భారీ యంత్రాలను మంగళవారం ఉదయం పంపించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. బ్రేక్‌లో సాంకేతిక లోపం లేదంటే లోకో పైలట్‌ నిర్లక్ష్యం కారణమని అనుమానం వ్యక్తమవుతోంది.

ఈ ప్రమాదంతో రుషికేశ్‌ ప్రాంతంలో రైలు రాకపోకలు తాత్కాలికంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. రక్షణ పనులు పూర్తయిన తర్వాతే సాధారణ సేవలు పునరుద్ధరించబడతాయని అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడం ఒక పెద్ద ఉపశమనం. అయితే, వరుసగా ప్రమాదాలు జరగడం రైల్వే భద్రతా వ్యవస్థలో లోపాలను స్పష్టంగా చూపిస్తోంది. 

మే 17న తిరువనంతపురం–హజ్రత్‌ నిజాముద్దీన్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం, మే 18న బీహార్‌లో ససారం–పాట్నా ప్యాసింజర్‌ రైలులో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగాయి. అదృష్టవశాత్తూ, ఈ రెండు ఘటనల్లోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Advertisement
 
Advertisement
Advertisement