కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చుట్టూ చట్టం ఉచ్చు మరింత బిగుస్తోంది. ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఆర్థిక అక్రమాలు, అవినీతి కేసులో ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. 2024 ఆగస్టులో ఇదే వైద్య కళాశాలలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత వెలుగులోకి వచ్చిన ఆర్థిక అక్రమాల కేసులో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర సంచలనంగా మారింది.
గవర్నర్ ఆమోదం.. కఠిన చట్టాల కింద చర్యలు
భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం సందీప్ ఘోష్‌పై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. సదరు అధికారి క్రిమినల్ ఉల్లంఘనలకు, అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు లభ్యమవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
సీబీఐ ఎఫ్‌ఐఆర్.. తెరపైకి మూడు సంస్థలు
ఈ అవినీతి వ్యవహారంలో సందీప్ ఘోష్‌తో పాటు మరో మూడు ప్రైవేట్ సంస్థలపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఇప్పటికే రెగ్యులర్ కేసు నమోదు చేసింది. ‘మా తారా ట్రేడర్స్’, ‘ఈశాన్ కేఫ్’, ‘ఖామ లౌహా’ అనే సంస్థలతో కలిసి ఘోష్ నేరపూరిత కుట్రకు, మోసాలకు పాల్పడినట్లు సీబీఐ తన దర్యాప్తులో గుcoolingర్తించింది. ప్రభుత్వ నిధులను దారిమళ్లించి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
సీఎం సువేందు అధికారి సోషల్ మీడియా ప్రకటన
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ముఖ్యమంత్రిగా ఇదొక అత్యంత పారదర్శకమైన, సానుకూలమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన అన్యాయాలపై చట్టపరమైన పోరాటంలో ఇదొక కీలక అడుగు అని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: మండుటెండను జయించే ‘ఆయుష్’ అస్త్రాలివే!


