ప్రపంచ యుద్ధాల రూపురేఖలు మారిపోతున్నాయ్. క్షిపణులు, అణు బాంబులు, డ్రోన్లు మాత్రమే కాదు.. ఇప్పుడు సరిహద్దులు, వనరులు, ఆఖరికి డిజిటల్ నెట్‌వర్క్‌లు కూడా ఆయుధాలయ్యాయి. అదెలా సాధ్యమో.. పశ్చిమాసియా యుద్ధంతో ఇరాన్ కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. తనకంటే బలమైన సైన్యం ఉన్న అమెరికాను విసిగెత్తిస్తూ ‘వార్ ట్రెండ్’ను సెట్ చేసింది.
ఇరాన్ తన సరికొత్త వ్యూహం అమలుకు.. హర్ముజ్ జలసంధిని వేదికగా చేసుకుంది. దీని ద్వారానే ప్రపంచంలో ఐదో వంతు చమురు రవాణా జరుగుతుందని తెలిసిందే కదా. అందుకే జలసంధిపై తమదే పూర్తి ఆధిపత్యం అని ప్రకటించుకుని.. టోల్‌ప్లాజా ఏర్పాటుతో వసూళ్లు చేపట్టాలని భావించింది. తద్వారా.. వచ్చిన సొమ్ముతో యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్‌ను పునరుద్ధరించుకోవడం, దేశ అభివృద్ధికి కావాల్సిన నిధుల్ని సమకూర్చుకుంటామని ప్రకటించి ప్రపంచ దృష్టిని ఆకర్షించుకోగలిగింది.
అదే సమయంలో.. సముద్ర గర్భం కేబుళ్లపై దృష్టిసారించి భయపెట్టింది కూడా. ఇప్పుడు కేబుళ్ల విషయంలో అమెరికన్ దిగ్గజ కంపెనీలు కాంప్రమైజ్ కావాలని.. ఎంతో కొంత తమకు చెల్లించాలని(పన్ను, ఫీజు, ఫైన్.. ఏదో ఒక రూపేణా).. అలాగే వాటి నిర్వహణ(రిపేర్లు వగైరా) బాధ్యతలు కూడా తమ ఆధ్వర్యంలోనే సాగాలని కండిషన్లు పెడుతోంది. లేకుంటే కత్తిరింపులు తప్పవన్నట్లు బెదిరిస్తోంది. అలా.. తన భౌగోళిక స్థానాన్నే ఇరాన్ ఆయుధంగా మలుచుకుంది.
టిట్ ఫర్ టాట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ విషయంలో ఏం చేయాలనుకున్నాడో.. ఇరాన్ ఆ పనే కౌంటర్‌గా చేసి చూపించింది. అదే ఆర్థికంగా దెబ్బ తీయడం. ఇరాన్‌ను ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేసిన ట్రంప్.. హర్ముజ్ బ్లాకేడ్, నిధుల ఫ్రీజ్‌లను చూపించి ఇరాన్ మెడలు వంచాలనుకున్నాడు. అయితే ఆ నష్టం ధాటికి ఇరాన్ తలొగ్గలేదు. సరికదా.. యుద్ధాన్ని సరికొత్త మలుపులు తిప్పింది.
యుద్ధం ప్రారంభంలో.. చౌకగా తయారైన షాహెడ్ డ్రోన్లు ఉపయోగించి అమెరికా రక్షణ వ్యవస్థలను ఆగమాగం చేసింది. తద్వారా అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఆ తర్వాత హర్ముజ్ జలసంధి ద్వారా నౌకాయానాన్ని అడ్డుకోవడంతో తన వ్యూహాన్ని మొదలుపెట్టింది. హర్ముజ్ అనేది కేవలం 21 కిలోమీటర్ల వెడల్పు ఉండడం, పైగా తమ తీరానికి దగ్గరగా ఇరాన్‌కు ఎంతో కలిసొచ్చింది. రోజుకు 100–150 నౌకలు వెళ్లే హర్ముజ్‌లో మైన్స్, డ్రోన్లు, ఫాస్ట్ అటాక్ బోట్స్‌తో నియంత్రించింది. ఫలితంగా ఒక్క నౌక కూడా నీట మునగకుండానే ఇన్సూరెన్స్ ప్రీమియంలు 300% పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది. యూరప్ దేశాలు అదనంగా 28 బిలియన్ డాలర్ల ఇంధన బిల్లు చెల్లించాల్సి వచ్చింది. అలా క్షిపణుల యుద్ధం కాస్తా ఆర్థిక యుద్ధం అయ్యింది.
భవిష్యత్తులో..
ఇరాన్ తన యుద్ధాన్ని క్షిపణుల నుంచి మరో దారికి మలిచింది. ఎనర్జీ + డేటా.. ఇవి రెండూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే అంశాలే. అలా రెండు కీలక ప్రవాహాలను ఒకేసారి నియంత్రించే శక్తి తమ వద్ద ఉందని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇకపై యుద్ధం కేవలం బాంబులు, గన్స్‌తో కాదు.. వివిధ వనరుల రూపంలోనూ జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఇరాన్ చూపించిన ఈ యుద్ధ వ్యూహాన్ని ఉత్తర కొరియా, చైనా అధ్యయనం చేస్తున్నాయి. రష్యా కూడా ఈ ఉద్రిక్తతను నిశీతంగా పరిశీలిస్తోంది. అందుకే ఇది కేవలం ఒక దేశానికి కాదు, ప్రపంచానికి కొత్త హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు.
కొత్తదేం కాదా?
ఇరాన్ అనుసరించిన ఈ వ్యూహం కొత్తేదేం కాదట. ఇది అర్థం చేసుకోవాలంటే చరిత్రలోని కొన్ని ఘట్టాలను గుర్తు చేసుకోవాలనుకుంటున్నారు విశ్లేషకులు.
థెర్మోపిలే యుద్ధం (480 BC): స్పార్టా రాజు లియోనిడాస్ కొద్దిమంది సైనికులతో పర్షియన్ సైన్యాన్ని ఒక పర్వత మార్గంలో నిలువరించగలిగాడు. సంఖ్యలో తక్కువైనా, భౌగోళిక స్థానం (చోక్‌పాయింట్)ను ఉపయోగించి శత్రువుల అధిక బలాన్ని నిర్వీర్యం చేశాడు. ఇది “స్థానం” అనే ఆయుధం ఎంత శక్తివంతమో చూపించింది.
రోమన్ సామ్రాజ్యం – కార్తేజ్: ప్యూనిక్ యుద్ధాల అనంతరం రోమన్లు కార్తేజ్ పొలాలను ఉప్పు చల్లి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. ఇది భౌగోళిక వనరులను ధ్వంసం చేసి శత్రువును బలహీనపరిచే వ్యూహం.
నెపోలియన్ (19వ శతాబ్దం): బ్రిటన్‌తో వాణిజ్యాన్ని నిషేధించి యూరప్ ఆర్థిక వ్యవస్థను నియంత్రించాడు. ఇది వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చిన ఉదాహరణ.
బలహీన దేశం కూడా తన భౌగోళిక స్థానాన్ని ఆయుధంగా మార్చుకుని శక్తివంతమైన దేశాలను నిలువరించగలదు. ఇది చరిత్ర చెప్పిన పాఠం. ఆ పాఠాన్నే ఇరాన్ వల్లేసింది. అమెరికా అణు బాంబులను ఆపడానికి యుద్ధం మొదలుపెడితే.. కానీ ఇరాన్ తన భూభాగాన్ని ఆయుధంగా మార్చి మరింత శక్తివంతమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది.


