నో టాయిలెట్‌, నో లీవ్స్‌ : రూ. 19 లక్షల జాబ్‌ వదిలేశా! | No toilet no leave constant pressure quits Rs 19 lakh PSU job | Sakshi
Sakshi News home page

నో టాయిలెట్‌, నో లీవ్స్‌ : రూ. 19 లక్షల జాబ్‌ వదిలేశా!

May 19 2026 2:53 PM | Updated on May 19 2026 3:10 PM

No toilet no leave constant pressure quits Rs 19 lakh PSU job

బాగా చదువుకోవడం, మంచి ఉద్యోగం సంపాదించడం ప్రతీ భారతీయ యువకుడి కల. అది ఏ ఐటీ ఉద్యోగమో, ప్రభుత్వ రంగ సంస్థ (PSU)లో ఉద్యోగమో అయితే జీవితం  సెట్‌ అన్నంత సంబరం. మంచి జీతం, ఉద్యోగ భద్రత, సమాజంలో లభించే గౌరవం వల్ల ఈ ఉద్యోగాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో యువ ఉద్యోగుల్లో ట్రెండ్‌ మారింది.  జాబ్‌లో పని ఒత్తిడి (Workplace Stress) కంటే, జీవితంలో మానసిక ‍ప్రశాంతత,  ఉద్యోగంలో సంతృప్తి అనేది ప్రధానంగా మారుతోంది. ఈ నేపథ్యంలో, ఎన్ఐటీ కురుక్షేత్ర (NIT Kurukshetra) పూర్వ విద్యార్థి, 25 ఏళ్ల ఇంజనీర్ సౌరభ్ మిట్టల్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భారత్ పెట్రోలియం (BPCL) సంస్థలో ఏడాదికి రూ. 19 లక్షల ప్యాకేజీతో లభించిన ప్రతిష్టాత్మక ఉద్యోగాన్ని, ఆయన వదులుకున్నాడు. ఎందుకు అలాంటి నిర్ణయం  తీసుకున్నాడు.


కలల ఉద్యోగం... కానీ ఏం లాభం
సౌరభ్ మిట్టల్ తన 22వ ఏటనే BPCLలో చేరాడు. ఎన్నో ఆశలతో, ఆశయలతో ఉద్యోగంలో చేరినప్పటికీ, అక్కడి పని వాతావరణం, పరిస్థితులు ఆయన ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. కనీస వసతులు కూడా లేని జీవితం.   తనకు పని చేయడానికి కేటాయించిన ఆఫీసు వాస్తవానికి ఒక గిడ్డంగి లాంటిదని సౌరభ్ వివరించారు. అక్కడ తాగడానికి నీళ్లు గానీ, టాయిలెట్ గానీ లేవు. ఏసీ కూడా పాడైందని, దాన్ని తానే స్వయంగా బాగు చేసుకోవాల్సి వచ్చిందని అతను చెప్పాడు. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, అతను ఈ విషయాన్ని తన మేనేజర్, హెచ్‌ఆర్,  ఉన్నతాధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకువచ్చినా, ఎలాంటి పరిష్కారం లభించలేదు. దీంతో తన ఇల్లు సుమారు 10 నిమిషాల నడక దూరంలో ఉండటంతో రోజుకు చాలాసార్లు ఇంటికి వెళ్ళేవాడు. తాను ఉద్యోగం మానేసే వరకు పరిస్థితి అలాగే ఉందని చెప్పుకొచ్చాడు. 

దీనికి తోడు  అక్కడి పని చాలా ఒత్తిడితో కూడుకున్నదని, పాతకాలపు పద్ధతుల్లో సాగేదని విమర్శించారు.అంతేకాకుండా సీనియర్ అధికారుల కోసం ఎయిర్‌పోర్ట్ పికప్‌లు, హోటల్ బుకింగ్‌లు వంటి వారి వ్యక్తిగత పనులను కూడా తనతో చేయించేవారట. అమ్మకాలు తగ్గినప్పుడు, ఉన్నతాధికారులు నేరుగా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చేవారు. వీడియో కాన్ఫరెన్సులు, ఫోన్ కాల్స్ సమయంలో తిట్టడం సర్వసాధారణమైపోయింది.

ఆఫీస్ వేళలు ముగిసిన తర్వాత కూడా అర్ధరాత్రి వరకు, వీకెండ్స్ (శని, ఆదివారాలు) లోనూ ఫోన్ కాల్స్ వస్తూనే ఉండేవని చెప్పారు.  దీంతో లీవ్‌లు  దొరకడం కష్టంగా ఉండేదని, ఇక ప్రమోషన్లు, జీతాల పెంపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదని పెదవి విరిచారు.. వీటన్నింటికీ  మించి,  తన చుట్టూ ఉన్న ఉద్యోగులంతా చాలా పెద్ద వయసు వారు కావడంతో, అక్కడ కొత్తగా నేర్చుకోవడానికి గానీ, కెరీర్ ఎదుగుదలకు గానీ పెద్దగా అవకాశం లేదనిపించిందని, "నా జీవితాంతం ఇలాగే గడపడాన్ని నేను ఊహించుకోలేక పోయాను" అని సౌరభ్ తన నిర్ణయాన్ని వివరించాడు.

ఇదీ చదవండి: 120 ఏళ్ల తర్వాత చిగురించిన ఆశ

సౌరభ్‌ నిర్ణయంపై కుటుంబంలో వ్యతిరేకత 
అయితే  ఈ ఉద్యోగాన్ని వదలేయాన్ని  సౌరభ్‌ నిర్ణయాన్ని అమలు చేయడం అంత సులువు కాలేదు. ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే భద్రత, గౌరవం కారణంగా ఆయన తండ్రి ఈ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, కొడుకు పడుతున్న మానసిక ఒత్తిడిని గమనించిన తల్లి మాత్రం ఆయన నిర్ణయానికి మద్దతుగా నిలిచారు.

ఇదీ చదవండి: మేయర్‌ పీఠంపై ఇండియన్‌ ఎవరీ తుషార్‌ కుమార్‌?

నెటిజన్ల స్పందన 
సౌరభ్ మిట్టల్ కథనం ఆన్‌లైన్‌లో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని అభినందిస్తూ పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. చాలా మంచి, ఆలోచనాత్మకమైన నిర్ణయం. ఆల్ ది బెస్ట్  చాలామంది సౌరభ్‌ నిర్ణయాన్ని సమర్ధించారు. "నేను కూడా 16 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను, మీ నిర్ణయాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలను. భవిష్యత్తుకు శుభాకాంక్షలు" అని మరొకరు, మంచి పని చేశావు, సోదరా”,  “మీకు అంతా మంచే జరగాలి” అంటూ పలువురు సౌరభ్‌కు మద్దతుగా నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement