నీట్‌ లీక్‌పై నాడు గళమెత్తాడు, సరిగ్గా రెండేళ్లకు! | NEET Paper Leak Controversy He Raised His Voice In 2024, Turns Main Accused In 2026 Scam, Check Details Inside | Sakshi
Sakshi News home page

నీట్‌ లీక్‌పై నాడు గళమెత్తాడు, సరిగ్గా రెండేళ్లకు!

May 19 2026 3:52 PM | Updated on May 19 2026 4:08 PM

NEET Paper Leak  An Accused In 2024 He Raised Voice

సాక్షి, న్యూఢిల్లీ :  2024లో నీట్ (NEET UG) పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించినప్పుడు, విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడిన వ్యక్తిగా మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన కెమిస్ట్రీ టీచర్ శివరాజ్ రఘునాథ్ మొతేగావ్కర్ గుర్తింపు పొందారు. విద్యార్థులు ఆయన్ను ఆప్యాయంగా "ఎమ్ సర్" (M Sir) అని పిలుచుకునేవారు. నాడు విద్యార్థులకు "ఘోర అన్యాయం" జరిగిందంటూ  వాదించిన ఆయన  కోర్టులో పిటిషన్ కూడా వేశారు. కానీ, సరిగ్గా రెండేళ్ల తర్వాత.. 2026 నీట్ (NEET UG) పేపర్ లీక్ కేసులో ఆయనే ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

శివరాజ్ మొతేగావ్కర్ అరెస్ట్ అయిన నేపథ్యంలో, 2024లో ఆయన విద్యార్థుల కోసం మాట్లాడిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారింది. "నీట్ 2024లో భారీ కుంభకోణం జరిగింది. దీనివల్ల మహారాష్ట్రలో చదువు కుంటున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. సంభాజీనగర్‌లోని ఔరంగాబాద్ హైకోర్టు బెంచ్‌లో మేము ఇప్పటికే పిల్ (PIL) దాఖలు చేశాం. విద్యార్థుల తరఫున మరో ప్రత్యేక పిటిషన్ కూడా వేశాము. ఈ రోజు మేము ముంబై వచ్చాము. బాంబే హైకోర్టులో అవసరమైన సమాచారాన్ని సేకరిస్తాము. మహారాష్ట్రలోని అన్ని న్యూస్ ఛానళ్ల ప్రతినిధులను కలిసి, దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని కోరతాము. పిల్లలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు మీడియా మద్దతు చాలా అవసరం."అని విద్యార్థుల తరపున గళమెత్తాడు. కట్‌ చేస్తే సరిగ్గా రెండేళ్లకు అదే విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తూ సీబీఐ చేతికి చిక్కాడు.

'ఎమ్ సర్' అరెస్ట్ 
లాతూర్‌లోని ప్రముఖ 'రేణుకాయ్ కెమిస్ట్రీ క్లాసెస్' (RCC) వ్యవస్థాపకుడైన శివరాజ్ రఘునాథ్ మొతేగావ్‌కర్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) మే 17 (ఆదివారం) నాడు అరెస్ట్ చేసింది. ఆయన నివాసాలు, కార్యాలయాలపై జరిపిన సోదాల్లో.. ఆయన మొబైల్ ఫోన్‌లో లీకైన నీట్ క్వశ్చన్ పేపర్ లభ్యమవ్వడంతో సీబీఐ ఈ చర్య తీసుకుంది.

ఇదీ చదవండి: నీట్‌లో ప్రశ్నలన్నీ మా క్వశ్చన్‌ బ్యాంకులోనివే : ఎవరీ కెమిస్ట్రీ టీచర్

ఎవరీ కెమిస్ట్రీ టీచర్ 'ఎమ్ సర్'?
లాతూర్‌లోని ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన మొతేగావ్కర్, మొదట్లో సైకిల్‌పై తిరుగుతూ విద్యార్థులకు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పేవారు  1990ల చివర్లో ఒక చిన్న అద్దె గదిలో కేవలం 10 మంది విద్యార్థులతో ఆయన కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. చేత్తో రాసిన నోట్స్ ఇస్తూ, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల కాంపిటేటివ్ పరీక్షల్లో టాపర్లను అందిస్తూ ఆయన స్వల్ప కాలంలోనే ఎంతో ప్రసిద్ధి చెందారు.

ఇదీ చదవండి: నో టాయిలెట్‌, నో లీవ్స్‌ : రూ. 19 లక్షల జాబ్‌ వదిలేశా!

ప్రస్తుతం 'ఆర్సీసీ' (RCC) క్లాసెస్‌కు మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన బ్రాంచ్ అయిన లాతూర్‌తో సహా 9 బ్రాంచ్‌లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 40,000 మంది విద్యార్థులు నీట్, జేఈఈ, సెట్ (NEET, JEE, CET) పరీక్షల కోసం ఇక్కడ చేరుతుంటారు. సోషల్ మీడియాలో (ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్) కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. నాడు విద్యార్థుల రక్షకుడిగా ఫోజులిచ్చిన ప్రముఖ విద్యావేత్తే, నేడు అదే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అవ్వడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement