పీడియాట్రిక్ ఐసీయూకు ఆధునిక వెంటిలేటర్ల విరాళం
మహారాణిపేట: ఆంధ్రా మెడికల్ కాలేజీ అలుమ్నీ సంఘం (1966 బ్యాచ్) ఆధ్వర్యంలో కేజీహెచ్, ఏఎంసీ పరిధిలోని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ)కు రూ.48 లక్షల విలువైన ఆరు అత్యాధునిక మాక్వెట్ వెంటిలేటర్లు విరాళంగా అందజేశారు. వీటిని ఏఎంసీ 1966 బ్యాచ్‌కు చెందిన ప్రముఖ అలుమ్నీ సభ్యులు డాక్టర్ నాగుల సీతారామయ్య, డాక్టర్ జి. గురుప్రసాద్ అందజేశారు. శ్వాస క్రియ చికిత్సకు సంబంధించిన ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ వెంటిలేటర్లు అత్యవసర స్థితిలో ఉన్న శిశువులు, పిల్లలకు సమర్థవంతమైన చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సందర్భంగా కలెక్టర్ హరేందిర ప్రసాద్ వెంటిలేటర్లను ప్రారంభించి పీడియాట్రిక్ ఐసీయూ విభాగానికి అందజేశారు. ప్రభుత్వ వైద్య సంస్థలను బలోపేతం చేయడంలో అలుమ్నీ భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొని ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ఈ సందర్భంగా అలుమ్నీ సభ్యులకు పీడియాట్రిక్స్ విభాగం తరఫున డాక్టర్ చక్రవర్తి, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చాన్స్‌లర్, మాజీ డీఎంఈ డాక్టర్ టి.రవిరాజు, డాక్టర్ పి.వి.సుధాకర్, పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ బి.ఎస్.చక్రవర్తి, డాక్టర్ టి.రాధ, డాక్టర్ పెద వీర్రాజు, డాక్టర్ వి.వి.జి. మోహన్ తదితరులు పాల్గొన్నారు.


