ఐఎఫ్‌ఆర్ ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి
కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్
మహారాణిపేట: ఐఎఫ్‌ఆర్–2026 నిర్వహణకు సంబంధించి మిగిలిన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చితో కలిసి కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఏర్పాట్ల పురోగతిని పరిశీలించారు. ఈ నెల 17 నుంచి 20 వరకు జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, ఐఎన్‌ఎస్ కాన్‌క్లేవ్, సిటీ పరేడ్ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రపతి, కేంద్ర రక్షణ మంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి తదితర ప్రముఖుల పర్యటనల దృష్ట్యా ప్రోటోకాల్ ఏర్పాట్లు కచ్చితంగా పాటించాలని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫిషింగ్ బోట్ జెట్టీలోని పడవలను తాత్కాలికంగా తరలించాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశించారు. కోస్ట్ గార్డ్, మైరెన్ పోలీసులు తీర భద్రత పర్యవేక్షించాలని తెలిపారు. మిలాన్ విలేజ్ స్టాళ్లు, సిటీ పరేడ్ సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను టూరిజం శాఖ చేపట్టాలని చెప్పారు. 18న జరిగే ఫుల్ డ్రస్ రిహార్సల్‌కు ముందే అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, పటిష్టమైన బారికేడింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. హోల్డింగ్ పాయింట్ల వద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరమైన మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని వైద్య శాఖను ఆదేశించారు. అలాగే వంతెన, రోడ్డు పనులు వేగవంతం చేయాలని, అగ్నిమాపక యంత్రాలు సిద్ధంగా ఉంచాలని, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎయిర్‌పోర్టు వద్ద రిసెప్షన్ డెస్క్, విశ్వప్రియ ఫంక్షన్ హాల్‌లో జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, నేవీ అధికారులు, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


