అప్పికొండలో శివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు
భద్రత, మౌలిక వసతుల కల్పనపై
కలెక్టర్ సమీక్ష
మహారాణిపేట: అప్పికొండ సోమేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 15న జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. పలు అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చే అవకాశం ఉన్నందున భద్రత, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్, వైద్య సదుపాయాలు వంటి అన్ని మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. ట్రాఫిక్ మళ్లింపుపై పోలీస్ శాఖ ప్రణాళిక రూపొందించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలు సక్రమంగా ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైన చోట తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాఖ ఆర్డీవో సుధాసాగర్, డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ టి.అన్నపూర్ణ, ఆలయ ఈవో పద్మావతి, పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


