లేబర్ కోడ్‌ల రద్దుకై నేడు మహాధర్నా
డాబాగార్డెన్స్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకురావడాన్ని నిరసిస్తూ గురువారం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో విశాఖలోనూ భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. గతంలో అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ.. 2019లో వేతనాల కోడ్, 2020లో పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రతా కోడ్, వృత్తి భద్రత–ఆరోగ్యం కోడ్‌లను కేంద్రం చట్టాలుగా మార్చింది. దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర వ్యతిరేకత కారణంగా ఐదేళ్లుగా వీటిని అమలు చేయలేదు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం కార్పొరేట్ల ఒత్తిడి మేరకు ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ కోడ్‌ల అమలుకు నోటిఫికేషన్ జారీ చేయడంపై కార్మిక లోకం భగ్గుమంటోంది.
నేడు భారీ ర్యాలీ
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు సిటు ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు సరస్వతి పార్క్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగనుంది. ఈ సమ్మెలో జిల్లా వ్యాప్తంగా సుమారు 5 లక్షల మందికి పైగా సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు, ఉద్యోగులు పాల్గొననున్నట్లు కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు.


