రేషన్
రూటు మార్చిన
మాఫియా
ప్రజాప్రతినిధుల అండతో పేదల బియ్యం పక్కదారి కంటైనర్ టెర్మినల్‌లో పటిష్ట నిఘాతో గంగవరం మార్గంగా విదేశాలకు తరలింపు వైజాగ్ పోర్టు నుంచి పెరిగిన బల్క్ బియ్యం ఎగుమతులు వీసీటీపీఎల్‌లో నెలకు 6 వేల కంటైనర్ల నుంచి 4 వేలకే పరిమితం
సాక్షి, విశాఖపట్నం: పేదవాడి ఆకలి తీర్చాల్సిన రూపాయి బియ్యం అక్రమార్కుల జేబులు నింపుతోంది. ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని, రాజకీయ అండదండలతో రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో నిఘా కట్టుదిట్టం కావడంతో స్మగ్లర్లు తమ రూట్‌ను మార్చినట్లు సమాచారం. నిఘా తక్కువగా ఉన్న గంగవరం, వైజాగ్ పోర్టుల ద్వారా బల్క్ రూపంలో విదేశాలకు బియ్యం తరలిస్తూ కోట్లు గడిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవస్థల కళ్లుగప్పి సాగుతున్న ఈ ‘బియ్యం’ బాగోతం వెనుక అసలు సూత్రధారులు ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొందరు కూటమి నేతల అండతోనే ఇదంతా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు నిఘా పెంచామని ప్రకటిస్తూనే, మరోవైపు అక్రమ రవాణాకు సరికొత్త మార్గాలు సుగమం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
విదేశాలకు భారీ ఎగుమతులు
విశాఖ నుంచి ఆసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు బియ్యం ఎగుమతులు జరుగుతుంటాయి. ఆఫ్రికాలో బెనిన్, ఐవరీకోస్ట్, గినియా, టోగో, జిబౌటీ, కామెరూన్ వంటి దేశాలకు, ఆసియాలో చైనా, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, వియత్నాం దేశాలకు, మిడిల్ ఈస్ట్‌లో యూఏఈ, ఇరాన్, కువైట్ దేశాలకు బియ్యం తరలింపులు అధికంగా ఉంటాయి. ఆయా దేశాలు బియ్యాన్ని ఆహారంగానే కాకుండా, ఆహార పదార్థాల తయారీ, సౌందర్య సాధనాల ఉత్పత్తుల్లోనూ వినియోగిస్తుంటాయి. ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని, పేదల కోసం సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు, కొందరు అధికారులు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేదలకు బియ్యం చేరకపోయినా పరవాలేదన్నట్లుగా వ్యవస్థలు వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కంటైనర్ టెర్మినల్‌లో తగ్గిన ఎగుమతులు
విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ (వీసీటీపీఎల్) నుంచి చైనా, యెమెన్, వియత్నాం దేశాలకు అధికంగా బియ్యం ఎగుమతి అవుతోంది. ప్రతి నెలా సుమారు 6,000 కంటైనర్లు (ఒక్కోటి 28 టన్నులు) వెళ్లేవి. అంటే నెలకు దాదాపు 1,68,000 టన్నుల ఎగుమతి జరిగేది. 2024 డిసెంబర్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ (సీఎఫ్‌ఎస్)ల్లో తనిఖీలు నిర్వహించి 483 టన్నుల బియ్యాన్ని సీజ్ చేసినట్లు ప్రకటించారు. అయితే అనంతరం ఆ బియ్యం రేషన్ బియ్యం కాదని ఈ ఏడాది జనవరి 2న కలెక్టర్ సర్క్యులర్ జారీ చేశారు. అదే సమయంలో పోర్టులో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి పౌర సరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులతో ప్రత్యేక నిఘా బృందాన్ని నియమించారు. దీంతో వీసీటీపీఎల్ నుంచి బియ్యం రవాణా గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం నెలకు సుమారు 98,000 టన్నులే ఎగుమతి అవుతున్నట్లు సమాచారం. అంటే 3,000–4,000 కంటైనర్లకు పరిమితమైందని తెలుస్తోంది.
తనిఖీలొద్దు.. సాఫీగా సాగిపోనీ
అధికార పార్టీకి చెందిన కీలక నేతల అండదండలతో ఓ కార్గో వ్యాపారి వేర్‌హౌస్‌ల నుంచి బియ్యం గంగవరం పోర్టుకు చేరుతోందన్న విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా మిగిలిన చోట్ల నుంచి జరుగుతున్న ఈ మొత్తం అక్రమ వ్యవహారంలో కూటమి ప్రభుత్వంలోని కొందరు ’చోటా’ నేతల పాత్ర కీలకంగా మారింది. గాజువాక, ఆనందపురం, పెందుర్తి ప్రాంతాల నుంచి సేకరించిన బియ్యం పెద్దిపాలెం, చోడవరం పరిసరాల రైస్ మిల్లులకు చేరి అక్కడి నుంచి పోర్టులకు తరలుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసినా అధికారులు మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో బియ్యం విషయంలో ఎలాంటి తనిఖీలు చెయ్యొద్దంటూ అధికార పార్టీకి చెందిన నేతల నుంచి ఆదేశాలు అందుతున్నట్లు సమాచారం. ఇదే అదనుగా పౌర సరఫరాల అధికారులు కూడా తమ చేతివాటం ప్రదర్శిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మండల స్థాయి నుంచి పోర్టుల వరకు సమగ్ర నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడే ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు
పోర్టుల్లో పెరిగిన
బల్క్ ఎగుమతులు
విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశాలకు బియ్యం రవాణా పెరిగింది. గతంలో సంవత్సరానికి 6 నుంచి 7 లక్షల టన్నుల వరకూ ఎగుమతులు జరిగేవి. అయితే 2024–25లో దాదాపు 10 లక్షల టన్నుల వరకు ఎగుమతులు జరిగాయని సమాచారం. ప్రతి నెలా 30 వేల టన్నులకు పైగా రవాణా జరుగుతోందని తెలుస్తోంది. గంగవరం పోర్టు నుంచి కూడా గత ఆరు నెలల్లో 10 వేల టన్నులకు పైగా బియ్యం ఎగుమతి జరిగినట్లు సమాచారం. కంటైనర్ టెర్మినల్‌లో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత బల్క్ రూపంలో గంగవరం నుంచి రేషన్ బియ్యం తరలింపులు పెరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.
నిఘా ఒకచోట అక్రమాలు మరోచోట..
కంటైనర్ టెర్మినల్‌లో నిఘా కట్టుదిట్టం కావడంతో అక్రమార్కులు తమ ఎగుమతులను గంగవరం, వైజాగ్ పోర్టుల వైపు మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి సమాచారం ఉన్నప్పటికీ, అక్కడ సమగ్ర నిఘా ఏర్పాటు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది అధికార పార్టీలకు చెందిన నేతలే ఈ అక్రమ ఎగుమతులకు పరోక్ష మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే రేషన్ బియ్యంపై నిఘాను ఒకేచోట పరిమితం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


