పెందుర్తిలో మేయర్ కక్షసాధింపు చర్యలు
8 అడుగుల కాలువ కోసం 30 అడుగుల స్థలం చదును వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల స్థలాన్ని లాక్కునే కుటిల ప్రయత్నం జీవీఎంసీ యంత్రాంగాన్ని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నేత శరగడం పేదలు, కార్యకర్తలను వేధిస్తే సహించబోమని హెచ్చరిక
పెందుర్తి: కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల అండతో జీవీఎంసీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎంసీ 96వ వార్డులో అధికారులు వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పెందుర్తి సమీపంలోని శిరిడిసాయి కాలనీలో కేవలం 8 అడుగుల కాలువ నిర్మాణం కోసం 30 అడుగుల స్థలాన్ని చదును చేసేందుకు బుధవారం ప్రయత్నించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, ఆయన అనుచరుల సూచనలతో, స్థానికంగా నివసిస్తున్న వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల స్వాధీనంలో దాదాపు 40 ఏళ్లుగా ఉన్న స్థలాన్ని అధికార బలంతో లాక్కోవాలనే ప్రయత్నం జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యుడు, మన్యం పార్వతీపురం జిల్లా పరిశీలకుడు, స్థానిక మాజీ కార్పొరేటర్ శరగడం చిన్న అప్పలనాయుడు ఘటనాస్థలికి చేరుకుని అధికారుల తీరును ప్రశ్నించారు. కేవలం 8 అడుగుల కాలువ కోసం 30 అడుగుల స్థలాన్ని ఎందుకు చదును చేస్తున్నారని ఆయన నిలదీశారు. కాలువ నిర్మాణానికి అడ్డంకి కాని దశాబ్దాల నాటి చెట్లను ఎందుకు తొలగించాలనుకుంటున్నారని మండిపడ్డారు. దీంతో అధికారులు తాత్కాలికంగా చదును చేసే పనులను నిలిపివేశారు.
అరాచకాలకు పరాకాష్ట :
శరగడం చిన్న అప్పలనాయుడు
ప్రశాంతంగా ఉన్న పెందుర్తిలో కూటమి ప్రభుత్వం అనవసరమైన వివాదాలు సృష్టిస్తోందని శరగడం చిన్న అప్పలనాయుడు ఆరోపించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు స్థానిక పేదలు, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని అన్నారు. ‘‘కేవలం 8 అడుగుల కాలువ కోసం 30 అడుగుల స్థలం చదును చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదు. స్థలాన్ని ఆక్రమించేందుకే మేయర్, ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 20 మంది టీడీపీ కార్యకర్తలు అక్కడికి రావడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా పేదలకు అన్యాయం జరగనివ్వం. అధికారులు నిబంధనల ప్రకారం, తమ పరిధిలోనే పనులు చేయాలి,’’ అని ఆయన హెచ్చరించారు.
పెందుర్తిలో మేయర్ కక్షసాధింపు చర్యలు


