కల్తీ పడగ విప్పె..
ఆరోగ్యం అటకెక్కె..
జిల్లాలో ఆహార భద్రత వ్యవస్థ కుప్పకూలింది. ఆహార భద్రత సూచికలో రాష్ట్రం అట్టడుగు స్థానానికి పడిపోవడం ఇక్కడి దారుణ స్థితికి అద్దం పడుతోంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువవ్వడం, సిబ్బందిని నియమించకపోవడం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. కాగితాలకే పరిమితమైన తనిఖీలు, నిరుపయోగంగా మారిన కోట్ల రూపాయల యంత్రాలు.. జిల్లాలో ఆహార కల్తీ మాఫియాకు అడ్డు లేకుండా చేస్తున్నాయి. – బీచ్‌రోడ్డు
దేశంలోనే ఆహార భద్రత సూచికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది చివరి స్థానం. ఇందుకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం. రాష్ట్రంలో ఆహార తనిఖీలు, పరీక్షల కేంద్రాల్లో సిబ్బంది లేకపోవడంతో నిఘా వ్యవస్థ పూర్తిగా పడకేసింది. ఆహార తనిఖీల శాఖలో దేశంలోనే అత్యల్ప సిబ్బంది కలిగిన రాష్ట్రం కూడా ఏపీనే కావడం గమనార్హం. ఫలితంగా కల్తీ ఆహారం విచ్చలవిడిగా మార్కెట్లోకి వస్తోంది. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 85 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో కల్తీ, నాణ్యత లేని ఆహారాన్ని అధికారులు గుర్తించారు. ఇలాంటి ఆహారాన్ని తిని ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నా, ప్రభుత్వం మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తక్షణమే ఖాళీలను భర్తీ చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
విశాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత
భారత ఆహార భద్రత నియమాల ప్రకారం.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఆహార భద్రత అధికారి ఉండాలి. దేశంలో చాలా రాష్ట్రాలు ఈ నిబంధనను పక్కాగా అమలు చేస్తున్నాయి. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో వందల సంఖ్యలో అధికారులు ఉండగా, మన రాష్ట్రంలో మాత్రం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకరు మాత్రమే ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 50 మందిలోపే సిబ్బంది ఉండటం గమనార్హం. ఇక పెదవాల్తేరులోని ఉమ్మడి విశాఖ జిల్లా కార్యాలయంలో 15 మంది అధికారులు అవసరం ఉండగా, గత 15 ఏళ్లుగా కేవలం ముగ్గురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఉన్న వారు కూడా చాలా ఏళ్లుగా ఇక్కడే ఉండటం ఆహార భద్రతను గాలికొదిలేశారు. దీంతో తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు సరిగ్గా జరగడం లేదు. కార్యాలయంలో సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి.
నిరుపయోగంగా విలువైన పరికరాలు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆహార భద్రత కోసం రూ.110 కోట్లు కేటాయించి, రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఆహార పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రంతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా విశాఖలో అత్యాధునిక ఆహార పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 2024 ఫిబ్రవరి నాటికి ఈ భవన నిర్మాణం పూర్తి కాగా.. ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే ఈ కేంద్రంలో రూ.10 కోట్ల విలువైన పరికరాలు కూడా సిద్ధం చేశారు. అయితే.. ఇక్కడ పని చేయాల్సిన సుమారు 70 మంది సిబ్బంది నియామకం ఎన్నికల వల్ల ఆగిపోయింది. తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టకపోవడంతో విలువైన పరికరాలు తుప్పుపడుతున్నాయి. భవనం నిరుపయోగంగా మారింది.
రాష్ట్ర ఆహార ప్రయోగశాల
ఆహార తనిఖీ, పరీక్ష కేంద్రాల్లో వేధిస్తున్న సిబ్బంది కొరత తనిఖీలు లేకపోవడంతో విచ్చలవిడిగా కల్తీ ఆహార విక్రయాలు దేశంలోనే అతి తక్కువ సిబ్బంది కలిగిన ఏకై క రాష్ట్రం ఏపీనే.. నిరుపయోగంగా మారిన మొబైల్ ఆహార పరీక్షల వాహనం
ఏడాదిలో కేవలం 161 తనిఖీలే
సిబ్బంది లేకపోవడంతో గడిచిన ఏడాది కాలంలో విశాఖ జిల్లాలో కేవలం 161 తనిఖీలు మాత్రమే చేశారు. వీటిలో 52 కేసులు నమోదు చేసి రూ.4.25 లక్షల జరిమానా విధించారు. ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడ, తిరుపతిలో చేసిన ఆకస్మిక తనిఖీల్లో 85 శాతం కల్తీ బయటపడటం విస్తుగొలుపుతోంది. తక్షణమే సిబ్బంది నియామకాలు చేపడితేనే ఈ ప్రమాదాన్ని అరికట్టడం సాధ్యమవుతుందని నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
కల్తీ పడగ విప్పె..


