ముస్తాబైన శివాలయాలు | - | Sakshi
Sakshi News home page

ముస్తాబైన శివాలయాలు

Feb 14 2026 10:14 AM | Updated on Feb 14 2026 10:14 AM

ముస్త

ముస్తాబైన శివాలయాలు

● రేపు మహాశివరాత్రి, 16న సముద్ర స్నానాలు ● భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు

మహారాణిపేట: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఈ నెల 15న ఆదివారం మహాశివరాత్రి, మరుసటి రోజు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తే అవకాశం ఉండటంతో దేవదాయ శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ టి.అన్నపూర్ణ తెలిపారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు

శివరాత్రి రోజున ఉపవాస దీక్షలతో వచ్చే భక్తుల కోసం ఆలయాల వద్ద చలువ పందిళ్లు, లైటింగ్‌, క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, ఉచిత ప్రసాద వితరణకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. దివ్యాంగుల సౌకర్యార్థం వీల్‌ చైర్లను కూడా అందుబాటులో ఉంచారు.

అప్పికొండపై ప్రత్యేక దృష్టి

మహాశివరాత్రి మరుసటి రోజు సముద్ర స్నానాలకు భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అప్పికొండ శివాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్నానాల ఘాట్‌ల వద్ద గజ ఈతగాళ్లను నియమించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఏసీ అన్నపూర్ణ శుక్రవారం అప్పికొండలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు. జిల్లాలోని పూర్ణామార్కెట్‌ వద్ద శ్రీ దుర్గాలమ్మ ఆలయం, అప్పికొండ శివాలయాలకు పది వేల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

చురుగ్గా ఏర్పాట్లు

వీటితో పాటు జిల్లాలోని వన్‌టౌన్‌ భీమేశ్వర రాజరాజేశ్వరస్వామి ఆలయం, సూర్యబాగ్‌ విశ్వేశ్వర స్వామి ఆలయం, ఆర్‌.కె.నగర్‌ రామలింగేశ్వర స్వామి ఆలయం, వెంకోజిపాలెం రామానంద ఆశ్రమం, సీతంపేట పార్వతీశ్వర అమ్మవారి ఆలయం, అస్సాం గార్డెన్స్‌లోని శ్రీ శివరామకృష్ణ స్వామి ఆలయం, నీలమ్మ వేపచెట్టు ఆలయం, రైల్వే న్యూకాలనీ ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం, సత్యనగర్‌ సోమేశ్వర స్వామి ఆలయం, మర్రిపాలెంకాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, బీచ్‌రోడ్డు ప్రసన్న పాండురంగ స్వామి ఆలయం, నక్కవానిపాలెం ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం, ఎన్‌ఏడీ కొత్తరోడ్డు ప్రమధ ఉమా విశ్వేశ్వర స్వామి ఆలయం, దొండపర్తిలోని శ్రీ రామమందిరం, పరదేశమ్మ అమ్మవారి దేవస్థానం, ఎరుకుమాంబ అమ్మవారి ఆలయం, లాసన్స్‌ బే కాలనీ వేంకటేశ్వర స్వామి ఆలయం, గుడిలోవ రంగనాథ స్వామి ఆలయం, పెందుర్తి పినగాడి గణేష్‌ పార్వతీ సమేత చౌడేశ్వర స్వామి ఆలయం తదితర ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.

డిప్యూటేషన్‌పై సిబ్బంది

నియామకం

శివ భక్తులు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ఈ విషయమై జిల్లాలోని అన్ని ఆలయాల ఈవోలు, మేనేజర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు శివాలయాల్లో అదనపు సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమించాం. రెండు రోజుల పాటు భక్తులకు సేవలు అందించడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది.

– టి.అన్నపూర్ణ,

సహాయ కమిషనర్‌, దేవదాయ శాఖ

ముస్తాబైన శివాలయాలు1
1/1

ముస్తాబైన శివాలయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement