టిడ్కో ఇళ్ల రుణమాఫీపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి
బీచ్‌రోడ్డు: 2024 ఎన్నికల ముందు టిడ్కో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల రుణాలను మాఫీ చేస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చినా, రెండేళ్లు గడిచినా అమలు కాలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు చెల్లించలేదని బ్యాంకులు నోటీసులు జారీ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఒక్కో లబ్ధిదారుడిపై రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు బకాయిలు ఉన్నాయని, చెల్లించకపోతే ఇళ్లు స్వాధీనం చేసుకుంటామని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయని ఆరోపించారు. రోజు కూలీపై జీవించే లబ్ధిదారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో టిడ్కో ఇళ్ల రుణమాఫీపై చర్చించి తీర్మానం చేయాలని, బ్యాంకుల వేధింపులను వెంటనే అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఎస్.వెంకటలక్ష్మి, ఎంఎన్‌ఎస్‌ఎస్ నగర కన్వీనర్ ఈ.లక్ష్మి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రామకృష్ణ, భారత నాస్తిక సమాజం జిల్లా కార్యదర్శి నూకరాజు, ఐపీఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి పి.లక్ష్మి పాల్గొన్నారు.


